ఆ సీఎం నిర్ణయం దేశానికే ఆదర్శం..!

Update: 2019-03-11 08:37 GMT
దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని జాతీయ - ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో మొదటి విడతలోనే ఏపీ - తెలంగాణలో పోలింగ్‌ జరగనుంది.

ఈ సందర్భంగా ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఒడిషాలో 4వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కూడా లోక్‌ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జగనున్నాయి. 147 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ప్రస్తుతం బీజూ జనతాదళ్‌ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ కొనసాగుతున్నారు.

ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక బృందం(ఎస్‌ హెచ్‌ జీ) సమావేశంలో ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ చట్ట సభల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని - అందువల్ల ప్రతి ముగ్గురిలో ఒక మహిళ పోటీ చేస్తుందన్నారు. రాష్ట్రంతోపాటు దేశ సర్వసమానత్వంలో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. మహిళా సాధికారత సాధించేందుకు ఒడిషా మహిళలు ముందుంటారన్నారు.

గతేడాది లోక్‌ సభతో పాటు అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రతిపాదించామని - ఈ ప్రతిపాదనను ఇప్పుడు ఆమోదించామని తెలిపారు. మహిళల కోసం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నవీన్‌ పట్నాయక్‌ ప్రత్యేక గుర్తింపు పొందగా.. ఇప్పుడు మహిళల కోసం 33 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. 
Tags:    

Similar News