ఒడిశా ఎఫెక్ట్‌: కేసీఆర్‌.. జ‌గ‌న్‌ల‌పై మ‌రింత ఒత్తిడి..?

Update: 2022-10-17 09:33 GMT
రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఆనుకుని ఉన్న ఒడిశా రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తీసుకున్న ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను ఇర‌కాటంలోకి నెడుతోందా?  ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన‌.. హామీల‌ను నిలబెట్టుకునే విష‌యంపై ఇక‌, ఒత్తిడి పెర‌గ‌నుందా? అంటే .. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద‌గా హామీలు ఏమీ ఇవ్వ‌లేదు. అయితే.. ఉద్యోగుల విష‌యంలోమాత్రం.. ప్ర‌స్తుతం ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాల‌ను ఎత్తేస్తామ‌ని మాత్రం ప్ర‌క‌టించారు.

అనుకున్న‌ట్టుగానే..ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌కే తాజాగా ఈ నిర్ణ‌యం అమ‌లు చేశారు. రాష్ట్రంలో ఇక‌, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల మాటే ఉండ‌దు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఒక స్పీప‌ర్‌ను నియ‌మించుకున్నా.. అది ప‌ర్మినెంట్ ఉద్యోగ‌మే. ఈ మేర‌కు రాష్ట్ర మంత్రి వ‌ర్గం తీసుకున్న నిర్ణ యాన్ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం 57 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒడిశాలో ప‌నిచేస్తున్నారు. ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న చేసిన‌నాటి నుంచి ఇక‌, వారంతా ప‌ర్మినెంట్ అవుతారు.

అంతేకాదు.. ఇక నుంచి జ‌రిగే అన్ని నియామ‌కాలు కూడా.. ఇదే ప్రాతిప‌దిక‌న తీసుకుంటారు. అయితే.. ఒడిసాలో తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు పరిశీల‌కులు. ఎందుకంటే.. ఇటు ఏపీలో అయినా..అటు తెలంగాణ‌లో అయినా.. అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ, టీఆర్ ఎస్ పార్టీలు.. ఉద్యోగుల‌కు.. ఇదే హామీ ఇచ్చాయి. అధికారంలోకి రాగానే.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల‌ను.. ప‌ర్మినెంట్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ముఖ్యంగా కేసీఆర్ అయితే.. 20 వేల మంది ఉద్యోగుల‌ను వెంట‌నే ప‌ర్మినెంట్ చేస్తామ‌న్నారు.

ఏపీలోనూ.. దాదాపు ఇదే మాట ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే.. విడ‌త‌ల వారీగా ఉద్యోగుల‌ను అంద‌రినీ ప‌ర్మినెంట్ చేస్తామ‌ని చెప్పారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఊసు రెండు రాష్ట్రాల్లోని పాల‌కులు ఎత్త‌డం లేదు. ప‌ర్మినెంట్ చేస్తే.. ప్ర‌భుత్వ ఖ‌జానాపై జీత భ‌త్యాల రూపంలో అద‌న‌పు భారం ప‌డుతుంద‌నే భావ‌న ఉండి ఉంటుంద‌ని అంటున్నారు. అయితే.. ఇప్పుడు పొరుగు రాష్ట్రం.. ఒడిశాలో సీఎం న‌వీన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డంతో.

ఈ ప్ర‌భావం ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌పైనా ఉంటుంద‌నే అభిప్రాయం ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నిక‌లు ఉండ‌డం.. గెలుపు గుర్రం ఎక్కాల‌నే వ్యూహంతో ముందుకు సాగుతుండ‌డం తో మ‌రి ఎన్నిక‌ల ముందైనా.. ఈ ఉద్యోగులకు సానుకూల నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News