ఆనందయ్యకు షాకిచ్చిన అధికారులు.. నోటీసులు జారీ

Update: 2021-12-28 15:31 GMT
కరోనా సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యింది. అయితే తాజాగా ఆయనకు అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఆనందయ్యకు తాజాగా నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.

కరోనా మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయో చెప్పాలని ఆదేశించిన జేసీ.. అనుమతులు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారంలోగా జారీ చేసిన నోటీసులపై వివరణ ఇవ్వాలని జేసీ పేర్కొన్నారు.

ఇక ఆనందయ్యకు జేసీనే కాదు.. సొంత గ్రామస్థులు కూడా షాకిచ్చారు. ఆనందయ్య కరోనా మందు పంపిణీకి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని కృష్ణపట్నం పంచాయితీ తీర్మానం చేసింది. అంతేకాదు..  ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ఆనందయ్య మందు మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఆనందయ్య కూడా తన స్వగ్రామంలో మందు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మొదట్లో ఆనందయ్య కోసం నిలబడ్డ గ్రామస్థులు ఇప్పుడు ఆయన మందు పంపిణీకి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. గ్రామంలో మందు పంపిణీ చేయడానికి వీల్లేదని అడ్డుకున్నారు.  

కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీని ప్రారంభించారు. అయితే గ్రామస్థులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మందు పంపిణీ చేయద్దన్న గ్రామస్థులు.. ఒమిక్రాన్ రాకముందే ఒమిక్రాన్ మందు ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి గ్రామానికి కొత్త వ్యక్తులు వస్తున్నారని.. దీనివల్ల గ్రామంలో కొత్త కొత్త రోగాలు వచ్చే  అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆనందయ్యకి గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మందు పంపిణీకి తనకు అన్ని అనుమతులున్నాయన్న ఆనందయ్య.. తన ఇంట్లో మందు పంపిణీ చేస్తే మీకు ఇబ్బంది ఏంటని గ్రామస్థులను నిలదీశారు.  అయితే ఆనందయ్య తీరుపై గ్రామస్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఊరిచివర మందు పంపిణీ ఏర్పాటు చేసుకోవాలని ఆనందయ్యకు సూచించారు.

 సెకండ్ వేవ్ సమయంలో ఆనందయ్య ఇచ్చే మందు కోసం కరోనా బాధితులు, రోగుల బంధువులు పోటీపడ్డారు. చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా మందు పంపిణీకి చర్యలు తీసుకుంది.
Tags:    

Similar News