లంచంతోనే పని.. అధికారి ఆడియో వైరల్

Update: 2019-11-13 09:27 GMT
తహసీల్దార్ విజయారెడ్డి హత్య జరిగినా.. భూముల పంచాయతీలతో రైతులు పెట్రోల్ డబ్బాలు పట్టుకొని తహసీల్దార్ ఆఫీసులకు వచ్చినా.. రెవెన్యూశాఖలో మాత్రం అవినీతి తగ్గడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరగడానికి కొందరు అవినీతి అధికారుల లంచాలే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా  రెవెన్యూలో అవినీతి తగ్గడం లేదనడానికి తాజాగా పట్టుబడుతున్న అధికారులు, వారి ఆడియో లీకులే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.

అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవలే ఇన్ చార్జి తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన అవినీతి ఆడియో కలకలం రేపుతోంది.

కదిరి రూరల్ మండలంలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాను మరొకరి పేరున మార్చడానికి కదిరి రూరల్ ఇన్ చార్జి తహసీల్లార్ హోదాలో ఉన్న డిప్యూటీ తహసీల్లార్ మాట్లాడిన ఆడియో ఆడియో లీకైంది. దీనికి ఎంత తాను లంచంగా తీసుకుంటానో అందులో ఆయన వివరించారు. ప్రభుత్వ భూమికి మార్కెట్ రేటు కట్టించి స్వాధీనం చేసుకోవడానికి ఎంత డబ్బు అవుతుందో డిప్యూటీ తహసీల్దార్ ఆడియోలో వివరించాడు. ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల్లో కూడా లంచాలు ఇవ్వాలని.. లక్ష ఖర్చు అవుతుందని చెప్పడం గమనార్హం.

 భూముల పట్టా మార్చే అధికారం తనకు ఉందని.. వివాదాస్పద భూముల పట్టాలు ఉంటే తీసుకురావాలని బ్రోకర్ తో మాట్లాడిన వైనం కూడా ఆడియోలో కనిపించింది. ఇక తహసీల్దార్ కార్యాలయంలో జరిగే ప్రతీ పనికి ఒక రేటు నిర్ణయించిన వైనం ఆడియోలో సదురు డిప్యూటీ తహసీల్దార్ చెప్పడం విశేషం. ఇలా డీటీ ప్రతీ పనికి రేటు విధించి లంచాలు దండుకోవడం  రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది.

కాగా కదిరి రూరల్ తహసీల్దార్ ఆడియో లీకైన వైనంపై మీడియా ప్రతినిధులు అధికారిని ప్రశ్నించగా.. ఆ ఆడియోతో తనకు సంబంధం లేదని.. తాను ఎవరికి రేట్ల గురించి చెప్పలేదని పేర్కొనడం విశేషం.
Tags:    

Similar News