మొద్దు శీను మాదిరే... అతడి హంతకుడూ జైల్లోనే మృతి

Update: 2020-07-27 16:00 GMT
తెలుగు దేశం పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి దివంగత పరిటాల రవీంద్ర హత్య కేసులో లెక్కలేనన్ని మలుపులు చోటుచేసుకున్నాయి. పరిటాలను తానే హత్య చేశానని బహిరంగంగానే ఒప్పుకుని అరెస్టైన మొద్దు శీను జైల్లో ఉండగానే... ఓం ప్రకాశ్ అనే వ్యక్తి చేతిలో దారుణంగా హత్యకు గురైన ఘటన పెను కలకలమే రేపింది. అయితే నాడు మొద్దు శీనును హత్య చేసిన ఓం ప్రకాశ్ కూడా ఇప్పుడు జైల్లోనే తుది శ్వాస విడిచాడు. మొద్దు శీను హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓం ప్రకాశ్... విశాఖ కేంద్ర కారాగారంలో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్య కారణాలతో అతడు ఆదివారం చనిపోయాడని జైలు అధికారులు ప్రకటించారు.

ప‌రిటాల ర‌వి హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న మొద్దు శ్రీనును 2008 నవంబర్ 9న‌ జైలులోనే డంబెల్‌ తో‌ కొట్టి ఓం ప్రకాశ్ హత్య చేశాడు. ఈ కేసులో ఓం ప్ర‌కాశ్ కు అప్ప‌ట్లో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో విశాఖ ఆరిలోవలోని కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఓంప్ర‌కాష్‌.. శనివారం రాత్రి శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది ప‌డ్డాడు. దీంతో అతడిని కేజీహెచ్‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున ఓంప్రకాష్‌ మృతిచెందిన‌ట్టు జైలు సూపరింటెండెంట్‌ రాహుల్ వెల్ల‌డించారు.

చాలా కాలంగా ఓం ప్ర‌కాశ్ జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి మూత్రపిండాలు దెబ్బ తిన్నాయి. గత కొంతకాలం నుంచే ఈ సమస్యతో సతమతమవుతున్న అతడు... తాజాగా మూత్రపిండాలు పూర్తిగా చెడిపోవడంతో డయాలసిస్ అవసరమైందట. పరిస్థితిని గమనించిన జైలు అధికారులు ఓం ప్రకాశ్ కు డయాలసిస్ చేయించేందుకు కేజీహెచ్ కు తరలించారట. శుక్రవారం కూడా కేజీహెచ్‌లోనే డయాలసిస్‌ జరిగిందని.. అయినా కూడా అతడు కోలుకోలేక ఆదివారం ఉద‌య‌మే మృతి చెందాడ‌ని జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. ఇదిలా ఉంటే... ఓం ప్రకాశ్ తల్లి కూడా మూత్రపిండాలు చెడిపోయిన కారణంగానే మృతి చెందారట.
Tags:    

Similar News