కాంగ్రెస్ తో చెట్టాపట్టాల్... ?

Update: 2021-10-19 09:30 GMT
ఏపీలో ఏం జరుగుతుందో ఆ దేవుడు కూడా ఊహించడం కష్టమే అనుకోవాలి. ఎందుకంటే ఎన్నికల వేళ ఎవరు ఎటు ఉంటారో ఎవరూ చెప్పలేరు. మరీ ముఖ్యంగా ప్రాక్టికల్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు ఎత్తులు పై ఎత్తులు అన్నీ కూడా వేరేగా ఉంటాయి. ఆయన కాదేదీ రాజకీయానికి అనర్హం అన్న లెక్కలతో ముందుకు పోతారు. 2018లో తెలంగాణా ఎన్నికల వేళ సడెన్ గా కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తుని కలిపేసి చంద్రబాబు అందరికీ షాక్ ఇచ్చేశారు. ప్రత్యేకించి తెలుగు తమ్ముళ్ళు ఈ పొత్తుని అసలు దిగమింగుకోలేకపోయారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా ఇలాంటి షాకింగ్ డెసిషన్స్ టీడీపీ వైపు నుంచి చాలనే ఉంటాయని అంటున్నారు.

కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుంటే జనాలు గట్టిగా కొడతారు అంటూ హాట్ హాట్ కామెంట్స్ అప్పట్లో చేసిన విశాఖ జిల్లా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా తెలంగాణాలో టీడీపీ కాంగ్రెస్ పొత్తుని చూసీ ఏమీ అనలేక అవాక్కయ్యారు. అయితే అది వేరే రాష్టం, ఏపీలో మాత్రం కాంగ్రెస్ తో ఎలాంటి స్నేహాలూ ఉండవంటూ అయ్యన్న లాంటి వారు అనాడు సర్దిచెప్పుకున్నారు. కానీ ఇపుడు ఏపీలో కూడా కాంగ్రెస్ తో కలసి టీడీపీ ప్రయాణం చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని టాక్. గండరగండ రాజకీయాలు చేసే చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాదు అని గట్టిగా నమ్ముతున్నారట.

బయటకు మాత్రం బీజేపీతో స్నేహంగా ఉంటున్నా కూడా చివరి నిముషంలో ఎన్నికల వేళ కాంగ్రెస్ వైపే బాబు మొగ్గు చూపుతారు అంటున్నారు. దీంతో ఏపీలో రకరకాల పార్టీలతో చంద్రబాబు మహా కూటమిని ఏర్పాటు చేస్తారని కూడా అంటున్నారు. ఆ కూటమిలో జనసేన, కాంగ్రెస్, ఉభయ‌ కమ్యూనిస్టులు ఉంటారంట. అంటే బీజేపీని ఒంటరిని చేసి టీడీపీ జగన్ని ఢీ కొట్టేందుకు ఈ మహా కూటమి రెడీ అవుతుంది అన్న మాట. ఇక కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు అంటే అక్కడే ఉంది అసలైన పాయింట్ అంటున్నారు. కాంగ్రెస్ ఎంత చెడ్డా జనాలకు తెలిసిన నాయకులు ఇంకా ఆ పార్టీలో ఉన్నారు. ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారి మాటలకు ఒక విలువ గౌరవం జనాల్లో ఈ రోజుకీ ఉంది. అలాగే వైఎస్సార్ నీడలా ఉండే కేవీపీ రామచంద్రరావు లాంటి వారిని ముందు పెట్టి జగన్ గురించి విమర్శలు చేయిస్తే అవి జనాల్లోకి బాగా వెళ్తాయని కూడా బాబు వ్యూహ రచన చేస్తున్నారుట.

ఇక కాంగ్రెస్ కి ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చి ఆ పార్టీని ఏపీలో నిలబెడితే తీరని నష్టం వైసీపీకే జరుగుతుంది అన్నది కూడా టీడీపీ అధినాయకుడి అంచనాగా ఉందిట. కేంద్రంలో మోడీ దిగిపోతే రెండవ పెద్ద జాతీయ పార్టీగా కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి రాగలదు. అపుడు మిగిలిన ప్రాంతీయ పార్టీలను కలుపుకుని యూపీయే త్రీని కనుక కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే ఢిల్లీలో చక్రం తిప్పవచ్చు అన్నది బాబు ఆశట. ఇక ప్రత్యేక హోదా, విభజన హామీలను కాంగ్రెస్ మాత్రమే ఇవ్వగలదు అంటూ రాహుల్ గాంధీని ఏపీకి రప్పించి ప్రచారం చేస్తే జనాల మద్దతు మహా కూటమికి పూర్తిగా ఉంటుందని కూడా బాబు మార్క్ లెక్కలు వేస్తున్నారుట.

మొత్తానికి కాంగ్రెస్ ని ఎడా పెడా అంటే అంటు గల్లీలో ఇటు ఢిల్లీలో వాడేసుకోవడానికి చంద్రబాబు అద్భుతమైన ప్రణాళికతో సిధ్ధమవుతున్నారని అంటున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటి అంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో మరోసారి కాంగ్రెస్ టీడీపీ జట్టు కట్టబోతున్నాయట. మొత్తానికి ఏ కాంగ్రెస్ వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని టీడీపీని అన్న ఎన్టీయార్ స్థాపించారో అదే కాంగ్రెస్ తో ఫ్యూచర్ లో టీడీపీ చెట్టాపట్టాలు వేయడం ఖాయమని తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూస్తే అర్ధమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News