వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సోషల్‌ మీడియా పిచ్చి పీక్స్‌ కు చేరిందా?

Update: 2020-04-04 07:30 GMT
ప్రపంచమంతా కరోనా వైరస్‌ బారిన పడి తీవ్రంగా సతమతమవుతున్న వేళ రాజకీయ నాయకుల వైఖరి మాత్రం మారడం లేదు. కరోనా వైరస్‌ ను కూడా తమ రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఢిల్లీ నాయకుల నుంచి గల్లీ నేతల వరకు అలాంటి వైఖరి ఉంది. మానవత్వం.. పేదలకు చేయూత పేరిట వారు చేసే సహాయం కొంత అయితే ప్రచారం మాత్రం ఎక్కువగా చేసుకుంటున్నారు. చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత మాదిరి రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఉంది. దీన్ని సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ లోని రాజకీయ నాయకులకు కూడా ఉంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దాదాపు రెండు వందలకు చేరువగా కరోనా కేసులు వస్తుండగా.. కరోనా బాధితుడు ఒకరు మృతిచెందడంతో రాష్ట్రంలో కలకలం రేగుతోంది. ఈ మేరకు కరోనా వైరస్‌ నివారణకు.. కట్టడి చేసేందుకు ప్రభుత్వం క్వారంటైన్‌.. ఐసోలేషన్‌ కేంద్రాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి క్వారంటైన్‌ - ఐసోలేషన్‌ కేంద్రం ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రల్లో ఒక గది లేదా కొన్ని గదులు తీసుకుని ఐసోలేషన్‌ వార్డుగా ఏర్పాటుచేశారు. కరోనా అనుమానితులను ఆ కేంద్రాల్లో 14 రోజుల పాటు నిర్బంధించి వైద్యం అందించనున్నారు. అలాంటి కేంద్రాలను ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేలు ఆర్భాటంగా ప్రారంభాలు చేస్తున్నారు. రిబ్బన్‌ కట్‌ చేస్తూ ఫొటోలకు ఫోజు ఇస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ ఆ విధంగానే చేశారు.

నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ వార్డును రిబ్బన్‌ కట్‌ చేసి ఆమె ప్రారంభించారు. అయితే ఆ వార్తను ఆమె తన సోషల్‌ మీడియాతో పత్రికలు - టీవీల్లో ప్రముఖంగా వచ్చేలా చేశారు. ఈ విధంగా ఆమె తన వ్యక్తిగత ప్రచారానికి వాడుకుంటున్నారు. ముందే ఉన్న ఆస్పత్రి.. ఆ ఆస్పత్రిలో కొన్ని గదులతో ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి రిబ్బన్‌ కట్‌తో ప్రారంభాలేమిటోనని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అత్యావసర పరిస్థితుల్లో ఏర్పాటుచేసిన కరోనా వార్డులకు రిబ్బన్‌ కట్‌ లేంట్రా? అని అవాక్కవుతున్నారు. ఆ కార్యక్రమాన్ని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడంపై చిలకలూరిపేటతో పాటు మిగతా ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఆమె మీడియా పిచ్చి పీక్స్‌ కు చేరిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. మానవత్వంతో లాక్‌ డౌన్‌ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధి ఇలా చిన్నచిన్న కార్యక్రమానికి ప్రచారం చేసుకోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.
Tags:    

Similar News