సండే సభ పెట్టారు..సీఎం సెలవు తీసుకున్నారు

Update: 2016-03-21 04:17 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విపక్షాలు మండిపడుతున్నాయి. అధికారపక్ష సభ్యులు సైతం లోలోన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దేవుడి లాంటి కేసీఆర్ మీద అధికారపక్ష నేతల అసంతృప్తి ఏ విషయంలో అంటే.. సండే పూట సభ నిర్వహించటంపై!  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సమయంలో శని.. ఆదివారాలు సెలవులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శనివారం సభను నిర్వహిస్తుంటారు. అయితే.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శని.. ఆదివారాలు సెలవులు ఇవ్వకుండా నాన్ స్టాప్ గా సమావేశాన్ని నిర్వహించాలని తెలంగాణ అధికారపక్షం నిర్ణయించింది.

దీంతో.. సండే నాడు కూడా సభ జరుగుతున్న పరిస్థితి. దీనికి అధికార.. విపక్ష సభ్యులు తొలుత వ్యతిరేకత వ్యక్తం చేయకున్నా.. సండేనాడు సభ పెట్టి సీఎం మాత్రం గైర్హాజరు కావటంపై వారు విమర్శిస్తున్నారు. సండే సభను పెట్టి.. సీఎం మాత్రం రావటం లేదని.. సెలవు ఆయన ఒక్కరు తీసుకుంటే సరిపోతుందా? మిగిలిన వారికి అక్కర్లేదా? అంటూ రుసరుసలాడుతున్నారు.

విపక్షంలోని కొందరు నేతలు కేసీఆర్ సెలవు మీద విమర్శలు చేస్తుంటే.. అధికారపక్ష నేతలు మాత్రం పైకి మమూలుగా ఉన్నప్పటికీ.. అంతర్గత సమావేశాల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సండే రోజున సభను నిర్వహించి ప్రత్యేకంగా సాధిస్తున్నది ఏమీ లేదని.. ఆ మాత్రం దానికి అందరినీ హైరానా పెట్టేసి సభను నిర్వహించటం.. సీఎం మాత్రం రాకపోవటం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఆనవాయితీకి భిన్నంగా ఆదివారం సభను నిర్వహించగానే సరిపోదు.. ముఖ్యమంత్రి సభకు హాజరై సమావేశాల్ని మరింత బాగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News