ఆ సంగతి సరే..మోడీ మాటలపై అంత మంటెందుకు?

Update: 2017-07-20 04:09 GMT
పాలకుల కుర్చీలో ఎవరున్నా సరే.. ప్రతిపక్షాలకు మంటెత్తి పోతూ ఉంటుంది. నిత్యం విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారు. ప్రధాని మోడీ కి ఎదురవుతున్న పరిస్థితులు ఇందుకు మినహాయింపేమీ కాదు. పైగా ఆయన పాలనలోని అవినీతి గురించి మాట్లాడ్డానికి పెద్దగా సబ్జెక్టు లేకపోవడం విపక్షాలకు బహుశా మంటెత్తిస్తూ ఉంటుంది కూడా! అందుకే వారు ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే సందర్భాల్లో తలా తోకా లేకుండా విమర్శలు రువ్వుతూ ఉంటారు. బుధవారం నాడు పార్లమెంటులో అదే పరిస్థితి కనిపించింది. విపక్షాలు రైతు సమస్యల మీద ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాయి. అయితే రైతు నినాదాలకు తోడుగా... ప్రధాని రేడియోలో తరచుగా ప్రసంగించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.

విషయానికి వస్తే..  విపక్షాలు రైతు అంశాల గురించి మాట్లాడి ఎడాపెడా ప్రభుత్వాన్ని తూర్పారబట్టడం ఓకే. కానీ మధ్యలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమం మీద వారి అక్కసు ఏమిటో అర్థం కాని సంగతి. ‘మన్ కీ బాత్ బంద్ కరో.. కర్జా మాఫీ షురూ కరో’ అంటూ పార్లమెంటు సభ్యుల నినాదాలు సాగాయి. రేడియోలో మాటలు ఆపేసి - రుణ మాఫీ ప్రారంభించండి అని వారి భావం. వారి నినాదాలను గమనిస్తే మోడీ మీద అక్కసుతో వారు ఉడికిపోతున్నట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే.. ఈ దేశంలో ఇప్పటికీ కూడా.. టీవీ వెళ్లలేని - లేని అనేక మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరువ కావడానికి రేడియో ఒక మంచి మాధ్యం అని గుర్తించిన నాయకుడు నరేంద్రమోడీ. ఆయన ప్రధాని అయ్యాక.. తరచూ రేడియో ప్రసంగాల ద్వారా తమ ప్రభుత్వం పనిచేస్తున్న తీరును, సమీప భవిష్యత్తులో పెట్టుకుంటున్న లక్ష్యాలను ఆ ప్రసంగాల ద్వారా ప్రజలకు నివేదిస్తున్నారు. దీనిద్వారా అపరిమితమైన పాప్యులారిటీని కూడా ఆయన సొంతం చేసుకుంటున్నారు. ఈ స్థాయిలో మోడీ కరిష్మా ప్రజల్లోకి వెళ్లడం, విపక్షాలకు సహజంగానే మింగుడుపడని సంగతి! అందుకే వారు తలా తోకా లేకుండా ఒకవైపు రైతు సమస్యల గురించి మాట్లాడుతూనే మరోవైపు మన్ కీబాత్ కార్యక్రమాన్ని ఆపు చేయాలంటూ అర్థం లేని డిమాండ్లు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags:    

Similar News