ఆ మందుల్ని ప్రపంచదేశాలు మన దగ్గర ఎంతలా కొన్నాయంటే?

Update: 2020-05-26 06:10 GMT
మాయదారి మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసిన వేళ.. వ్యాపారరంగం కుదేలైంది. ఇప్పటివరకూ ఎదుర్కొన్న సంక్షోభాలకు మించిన దారుణ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంది. ఇలాంటి సమయంలో ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. అత్యవసరాలు తప్పించి మిగిలిన వస్తువుల్ని కొనేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా లేరు. ప్రపంచంలోని పలుదేశాల్లో పెద్ద ఎత్తున అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యం లో మన దేశం నుంచి ఫార్మా కంపెనీల ఎగుమతులు భేషుగ్గా ఉన్నాయని చెబుతున్నారు.

ఇప్పుడున్న సంక్షోభ సమయంలోనూ ఒక్క ఏప్రిల్ నెలలోనే ప్రపంచంలోని పలు దేశాలకు మన ఔషధాలు పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యాయి. ఫార్మాగ్జిల్ లెక్కల ప్రకారం 2019 ఏప్రిల్ నెలలో జరిగిన ఎగుమతులతో పోలిస్తే.. ఈ ఏడాది ఎగుమతల విలువ ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ప్రపంచ దేశాలకు మన దేశంలోని ఫార్మా కంపెనీలు ఏయే ఔషదాల్ని పంపుతున్నాయన్నది చూస్తే.. యాంటీ రెట్రో వైరల్ మందులతో పాటు.. కేన్సర్ ఔషధంతో పాటు యాంటీ బయాటిక్స్.. ఫారాసెట్మాల్.. క్లోరోక్విన్ తదితర ఔషధాల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఆ ఒక్క నెలలోనే దేశం నుంచి పలు దేశాలకు ఏకంగా రూ.11,500 కోట్లు విలువైన మందుల్ని ఎగుమతి చేసినట్లుగా చెబుతున్నారు.

మన దగ్గర ఔషధాల్ని ఎక్కువగా కొనుగోలు చేసిన దేశాల విషయానికి వస్తే  అమెరికా.. బ్రెజిల్.. ఐరోపా.. ఆఫ్రికా దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్.. క్లోరోక్విన్ ఫాస్పేట్.. అజిత్రోమైసిన్.. అమాక్సలిన్.. పారాసెట్మాల్ మందుల్ని ఎక్కువగా కొనుగోలు చేశాయి. దాదాపు ప్రపంచంలోని 150 దేశాలు మన దగ్గర ఔషదాల్ని కొనుగోలు చేయటం గమనార్హం. ఎగుమతుల పరంగా మన ఫార్మా కంపెనీలకు ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటే.. దేశీయంగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

లాక్ డౌన్ వేళ.. ప్రజలు బయటకు రాకపోవటం.. అత్యవసరమైతే వైద్యం కోసం ఆసుపత్రి చుట్టూ తిరిగే అవకాశం లేకోవటంతో.. మందుల కొనుగోళ్లు తగ్గినట్లు చెబుతున్నారు. దీనికి తోడు ఇంట్లోనే భోజనం చేయటం.. బయట ఫుడ్ తినే అవకాశం లేకపోవటంతో పాటు.. దేశ ప్రజలు ఆరోగ్య సూత్రాల్ని జాగ్రత్తగా పాటించటంతో వ్యాధుల తీవ్రత తగ్గిందని చెబుతున్నారు. 2019 ఏప్రిల్ లో దేశీయంగా ఔషధాల అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ లో 12 శాతం మందుల వినియోగం తగ్గినట్లుగా గుర్తించారు. అత్యవసర శస్త్రచికిత్సలు తప్పించి మిగిలినవన్నీ వాయిదా వేయటంతో ఇప్పుడున్న పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
Tags:    

Similar News