‘కుంగిన’ మాటపై నారాయణ ఫైర్

Update: 2016-06-24 06:10 GMT
ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో నిర్మిస్తున్న ఏపీ సచివాలయం మూడు అడుగల మేర కుంగిపోయిందంటూ వస్తున్న వార్తల్ని ఏపీ మంత్రి నారాయణ తీవ్రంగా ఖండించారు. అసలు అలాంటిదేమీ లేదన్న ఆయన.. ఇలాంటి వార్తల్ని ప్రచారం మొదలెట్టిన మీడియా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవన్నారు. పిల్లర్లు కుంగిపోయాయంటూ చేస్తున్న వాదనలన్నీ నిజాలు కావని.. అవన్నీ అభూతకల్పనలుగా కొట్టిపారేశారు.

మరో మూడు రోజుల్లో హైదరాబాద్ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వెలగపూడిలో నిర్మిస్తున్న ఏపీ తాత్కాలిక సచివాలయానికి షిఫ్ట్ కావాల్సిన వేళ.. సదరు నిర్మాణం కుంగుబాటుకు లోనైందని.. మూడు అడుగుల మేర భవనం కుంగిపోవటంతో.. అధికారులు ఆందోళనలు చెందుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో ఒక్కసారి భయాందోళనలు వ్యక్తమయ్యాయి. నీటి ఊట వస్తుందన్న మాట కూడా ప్రచారం సాగుతున్న వేళ.. ఆ వాదనలు తప్పంటూ ఏపీ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు.

తప్పుడు సమాచారంలో లేనిపోని ఆందోళనలు పెంచాలన్న కుయుక్తులు పారవన్న నారాయణ.. ఇదంతా విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారంగా చెప్పారు. తాను అదే భవనంలో ఉంటానని.. కుంగిపోయింది ఎక్కడో తనకు చూపించగలరా? అంటూ సవాలు విసిరారు. ఇన్ని మాటలు చెప్పే కన్నా.. మీడియాను తీసుకెళ్లి.. సచివాలయ ప్రాంగణం మొత్తం చూపిస్తే ఇలాంటి ప్రచారాలకు తెర పడుతుంది కదా..?
Tags:    

Similar News