బాబు ఆ నిర్ణ‌యంపై వెన‌క్కు త‌గ్గారు

Update: 2017-01-06 06:26 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిరస‌న‌ల ప‌ర్వం పెద్ద ఎత్తున వ‌స్తుండ‌టంతో త‌న నిర్ణ‌యం నుంచి వెన‌క్కుత‌గ్గారు. రాష్ట్రంలోని మున్సిపల్ పాఠశాలల్లో తెలుగుమీడియం రద్దు చేస్తూ ఇంగ్లీషు మీడియం తక్షణమే అమలు చేయడంపై ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు చదువుతున్న మీడియంలోనే పరీక్షలు రాసేందుకు, ఇష్టం ఉన్న వారిని మాత్రమే ఇంగ్లీషు మీడియంలో చేర్పించేందుకు వీలుగా జీవోలో మార్పులు చేయనున్నారు. తెలుగు మీడియంలోనే కొనసాగుతున్నామన్న వారి నుంచి లేఖ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించడం గమనార్హం.

విజయవాడలోని సీఆర్‌ డీఎ కార్యాలయం వద్ద పురపాలక శాఖ మంత్రి నారాయణ విలేక‌రులతో మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇబ్బంది లేదని - తెలుగు మీడియంలో చదువుతున్న వారు ఆ మీడియంలోనే పరీక్ష రాయచ్చని తెలిపారు. తాము చదువుతున్న మీడియంలోనే పరీక్ష రాసే వీలు ఉంటుందన్నారు. వచ్చే ఏడాది మాత్రం విద్యార్థుల తల్లితండ్రులతో మాట్లాడి వారిని ఇంగ్లీషు మీడియం వైపు మార్చేలా కౌన్సిలింగ్ నిర్వహించాలని అనుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం అమలు చేస్తామని తెలిపారు. దీనిని రాజకీయం చేయవద్దని - ఫౌండేషన్ కోర్సు ప్రారంభం సమయంలో కూడా విమర్శలు చేశారని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులకు ఉపాధ్యాయులు - తల్లితండ్రుల సహకారం అవసరమని, ఆందోళన చెందవద్దని నారాయ‌ణ‌ తెలిపారు.

తెలుగు మీడియంలో చదవడం వల్లే పోటీ పరీక్షల్లో ఎంపిక కావడం లేదని నారాయ‌ణ అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలు అన్నీ ఇంగ్లీషులో జరుగుతున్నాయని, ఎంసెట్‌ లో సీట్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి ఎక్కువగా రావడం లేదని నారాయ‌ణ‌ తెలిపారు. ఇంగ్లీషు చదివే విద్యార్థులు ఇంటర్నెట్ వినియోగించుకుని మరింతగా ప్రిపేర్ అయ్యే వీలు ఉంటోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి ర్యాంకులు - భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నామని నారాయ‌ణ తెలిపారు. కాగా తెలుగుజాతి సంక్షేమ కోసం త‌ను అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తాన‌ని పేర్కొనే టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ భాష‌నే స్కూళ్ల‌లో లేకుండా చేయ‌డంపై అన్నివ‌ర్గాల నుంచి తీవ్ర నిర‌స‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో బాబు ప్ర‌భుత్వం వెన‌క్కుత‌గ్గింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News