'చాయ్‌ని జాతీయ పానీయంగా ప్రకటించాలి'.. ఈ బీజేపీ ఎంపీలు మారరా?

Update: 2022-12-14 08:11 GMT
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయింది.  వారు తమ నోటికి ఏం వస్తే అదే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ దుమారం రేపుతున్నారు. అప్పట్లో ఓ మతప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు యావత్ ముస్లిం దేశాలను కదిలించాయి. ఆందోళనకు పురిగొల్పాయి. ఇక ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని బల్లియా నియోజకవర్గ బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్  తీసుకున్న నిర్ణయం పెనుదుమారం రేపింది.

దేశంలోని ఏ ఎంపీ అయినా అభివృద్ధి కోసం తన నిధులు ఖర్చు చేస్తారు. కానీ వీరేంద్రసింగ్ తన ఎంపీల్యాండ్స్ రూ.5 కోట్ల నిధిని దేవాలయాల వద్ద "భజన-కీర్తనలు" నిర్వహించడానికి ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు. ఇది నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి పనుల కోసం ఉద్దేశించిన నిధి. దీన్ని అసాధారణంగా ఉపయోగించడం వివాదాస్పదమైంది. పైగా "ఆధ్యాత్మిక మేల్కొలుపు" కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార పార్టీ ఎంపీ చెప్పడం రాజకీయంగా విమర్శలకు దారితీసింది..

అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన ఈ నిధులను భజనకు కేటాయించడం దుమారం రేపింది. అవసరమైన నిధులను ఉపయోగించడంపై ఎంపీలు మార్గదర్శకాలను అనుసరించాలి. ఉదాహరణకు ఎంపీలు తరచుగా రోడ్లు, పాఠశాలలు ,క్లినిక్‌లు నిర్మించడం వంటి ప్రాజెక్టులలో ఈ ఎంపీ నిధులను ఉపయోగిస్తారు.ఇలా అభివృద్ధిని పక్కనపెట్టి బీజేపీ నేతలు హిందుత్వం, భజనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇవన్నీ చాలవన్నట్టు తాజాగా బీజేపీ అస్సాం ఎంపీ పవిత్ర మార్గరెటా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. 'చాయ్ ని నేషనల్ డ్రింక్ గా ప్రకటించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి.

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ.. గుజరాత్ నుంచి నార్త్ ఈస్ట్ వరకూ ప్రతి ఇంటి కిచెన్ లో 'చాయ్' లభిస్తుంది. దేశ ప్రజలు చాయ్ తోనే తమ దినచర్యను ప్రారంభిస్తారు. అందుకే 'టీ'ని జాతీయ పానీయంగా ప్రకటించాలి అని ఆయన కోరారు.

ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల మంది తేయాకు కూలీలు పనిచేస్తున్నారని అస్సాం ఎంపీ పేర్కొన్నారు. 2023 నాటికి అస్సాం టీకి 200 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని బీజేపీ ఎంపీ కూడా సభలో చెప్పారు.

"అసోం ప్రజలు ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటారు. అందువల్ల, అస్సాం టీ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్రం తన సహకారాన్ని అందించాలని నేను అభ్యర్థిస్తున్నాను" అని ఈ ఎంపీ తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టారు. .

టీ పేరుతో మార్కెట్లో వివిధ రకాల టీ డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయని, ఇది టీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మార్గరీటా సభకు వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ఆయన కోరారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News