పొరుగుదేశమైన పాకిస్థాన్ లో మత మార్పిడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పడానికి ఇది పక్కా ఉదాహరణ. ఓ హత్య కేసులో ఉన్న 42 మంది క్రిస్టియన్లకు షాకింగ్ ఆఫర్ ఒకటి తగిలింది. అదే మతం మారడం. అది కూడా మధ్యవర్తులు కాదు. సాక్షాత్తు పబ్లిక్ ప్రాసిక్యూటర్! `ఇస్లాంలోకి మారండి, మిమ్మల్ని నిర్దోషులుగా విడుదల చేయిస్తా` అని ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బేరం పెట్టడం గమనార్హం.
2015లో రెండు చర్చిలపై ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత ఇద్దరిని హత్య చేసినట్లు ఈ 42 మంది క్రిస్టియన్లపై ఆరోపణలు ఉన్నాయి. ఆత్మాహుతి దాడి వెనుక ఆ ఇద్దరే ఉన్నారన్న అనుమానంతో వాళ్లు హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు. యాంటీ టెర్రరిజం కోర్టులో దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సయ్యద్ అనీస్ తమ క్లైంట్లకు ఈ ఆఫర్ ఇచ్చాడని వారి తరఫు అడ్వొకేట్ జోసెఫ్ ఫ్రాన్సీ వెల్లడించాడు. అయితే దీనిని వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారని, ఒకరైతే ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధమేగానీ మతం మార్చుకోనని చెప్పినట్లు ఫ్రాన్సీ తెలిపాడు. మొదట తన తప్పును అనీస్ అంగీకరించకపోయినా.. వీడియో ఆధారం ఉందని చెప్పిన తర్వాత ఆయన దారికి వచ్చాడు. అలాంటి ఆఫర్ ఇచ్చి ఉండొచ్చని అనీస్ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/