ఆ గాయకులను ఇండియాలో ఏం చేశారు?

Update: 2016-01-01 09:29 GMT
పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు గాయకుల విషయంలో ఇండియాలో వచ్చిన స్పందన భిన్నంగా కనిపించింది.  కొత్త సంవత్సరం రోజున ఒకరికి సంతోషం కలిగిస్తే.. ఇంకొకరిని బాధపెట్టారు. ఇద్దరూ దిగ్గజ గాయకులు కావడంతో ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.

హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పాక్‌ సింగర్‌ రహత్‌ ఫ‌తే అలీఖాన్‌ కు చేదు అనుభవం ఎదురైంది. ఫలక్‌నుమా ప్యాలస్లో జరిగే న్యూ ఇయర్‌ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన అబుదాబి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో దిగిన వెంటనే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు రహత్‌ ను తిరిగి అదే విమానంలో వెన‌క్కి పంపించివేశారు. భద్రత కారణాల దృష్ట్యా అధికారులు ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన ట్రావెల్ డాక్యుమెంట్లలో లోపాలున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. పాకిస్థానీలు ఎవరూ నేరుగా హైదరాబాదులో దిగేందుకు నిబంధనలు అనుమతించబోవని అధికారులు చెబుతున్నారు. పాకిస్థాన్ జాతీయులు ఇండియా రావాలంటే తొలుత ఢిల్లీ  - ముంబయి - కోల్ కతా - చెన్నై ఎయిర్ పోర్టులకు మాత్రమే రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్లొచ్చని చెబుతున్నారు. కానీ, రఫత్ నేరుగా హైదరాబాద్ రావడంతో తిప్పి పంపినట్లు అంటున్నారు.

అయితే... ఫలక్ నుమా ప్యాలస్ లో రాత్రి 8 గంటలకు జరగాల్సిన రఫత్ కార్యక్రమానికి మాత్రం ఎలాంటి ఆటంకం రాలేదు. కాస్త వాయిదా పడింది. రాత్రి 8 గంటలకు జరగాల్సింది 11కి మొదలైంది. హైదరాబాద్ నుంచి తిప్పి పంపడంతో తిరిగి ఆయన అబుదాబీ వెళ్లి అక్కడి నుంచి మళ్లీ వెంటనే ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. అయితే.. రాత్రి 1 గంట వరకు మాత్రమే వేడుకలకు అవకాశం ఉండడంతో రఫత్ కచేరీ కొద్దిసేసే జరిగింది. కాగా రఫత్ బాలీవుడ్ సినిమాల్లోనూ తరచూ పాటలు పాడుతుంటారు.

ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ కు చెందిన మరోగాయకుడు.. చాలాకాలంగా ఇండియాలో ఉంటున్న అద్నాన్ సమీకి భారత ప్రభుత్వం భారత పౌరసత్వం ప్రకటించింది. న్యూ ఇయర్ రోజున భారత్ తనకు గొప్ప కానుక ఇచ్చిందని ఆయన సంతోషం ప్రకటించారు. లాహోర్ లో జన్మించిన అద్నాన్ సమీ 2001 నుంచి ఇండియాలో తాత్కాలిక వీసాపై ఉంటున్నారు. ఇండియా వచ్చాకే తాను గొప్పోడ్నయ్యానని గతంలో ప్రకటించిన అద్నాన్ సమీ బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు.

మొత్తానికి ఇద్దరు పాక్ గాయకుల్లో 2016 కొత్త సంవత్సరం రఫత్ కు చేదు అనుభవం... అద్నాన్ కు అరుదైన గౌరవం అందించాయి.
Tags:    

Similar News