ఆదాయం పావలా .. అప్పు రూపాయి... పాకిస్తాన్‌ దివాలా

Update: 2021-12-27 00:30 GMT
చరిత్రలో ఎన్నో దేశాలు రెండుగా విడిపోయాయి. కొన్ని నాలుగైదుగా కూడా విడిపోయాయి. కొరియా, జర్మనీ, రష్యా, కాంగో.. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటిలో ఒక దేశం బలంగా ఎదిగితే మరోటి బలహీనంగా మారుతుంటుంది. ఇదే కోవలో ఇప్పుడు భారత్-పాకిస్థాన్ లను చూడాల్సి ఉంటుంది. భారత్ కు ఎన్ని సమస్యలున్నా.. అభివ్రద్ధి పరంగా ముందుకెళ్తూనే ఉంది. అన్నిటికి మించి ఇక్కడ స్థిరమైన ప్రజాస్వామ్యం ఉంది. బలమైన ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి.

పాలనలో  సైన్యం పెత్తనం అంటూ ఏమీ ఉండదు. కానీ, మత రాజ్యం పాకిస్థాన్ లో దీనికి పూర్తిగా విరుద్ధం. ఆ దేశ చరిత్రలో సైనిక పాలనే అధికం. మూడేళ్ల క్రితం క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి అయినా.. ఆయన వెనుకుండి నడిపిస్తున్నది సైన్యమే. ఇమ్రాన్ సర్కారులో సైన్యం పాత్రపై ఇప్పటికే అనేక కథనాలున్నాయి. ఇదంతా పక్కనపెడితే పాకిస్థాన్ గతంలో ఆర్థికంగా చెప్పుకోదగ్గ స్థితిలో అయినా ఉండేది. ఉగ్రవాదానికి ఎంత ఊతమిచ్చినా ఆర్థికంగా ఆ దేశానికి ఎంతో కొంతైనా వెసులబాటు ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం కరెంట్ అకౌంట్, ద్రవ్య లోటును పరిశీలిస్తే దేశం దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మాటన్నది ఎవరో కాదు.. ఆ దేశ ఆర్థిక వ్యవహారాల దర్యాప్తు సంస్థ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎఫ్‌బీఆర్) మాజీ చైర్మన్ సయ్యద్ షబ్బర్ జైదీ. హమ్‌దర్ద్ యూనివర్సిటీలో చేసిన ఓ ప్రసంగంలో దేశ ఆర్థిక పరిస్థితిపై షబ్బర్ జైదీ మాట్లాడారు.

"అంతా బానే ఉంది, అన్నీ సవ్యంగా సాగుతున్నాయి అని ప్రభుత్వం చెబుతోంది. కానీ, అవన్నీ అబద్ధాలు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆ దేశంలో పెద్ద దుమారాన్నే లేపాయి. "అప్పులు తీసుకోవాలనే భావన నుంచి మనం బయటపడాలి. రుణాలతో దేశం నడవదు. మనం సర్వీసులను ఎగుమతి చేయాలిగానీ పని చేసే వ్యక్తులను కాదు. అఫ్గానిస్తాన్‌లో అందరినీ కలుపుకుపోయే ప్రభుత్వం వచ్చేవరకు పాకిస్తాన్ చిక్కుల్లోనే ఉంటుంది. పాకిస్తాన్ ఎగుమతులు 20 బిలియన్ డాలర్లు (రూ.1,52,027 కోట్లు). మన దేశ ఎగుమతులను పశ్చిమ దేశాలే కొనుక్కుంటున్నాయి. అందువల్ల మన ఎగుమతులు పెరగాలంటే అమెరికాతో స్నేహం చేయాలి." అంటూ ఆయన సూచించారు. "నాకు ఇప్పటి వరకూ సీపీఈసీ అర్థం కాలేదు. అందులో పారదర్శకత తీసుకురావాలి. ఇది మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. భారత్ నుంచి మందులు తీసుకుంటున్నాం. భారతదేశంతో మనకు వ్యాపార సంబంధాలు లేవంటూ ఆడుతున్న నాటకాలు ఆపాలి.

ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఆంగ్లం బోధించాలి. ఇంగ్లిష్ నేర్చుకోని పిల్లలు సెకండ్ క్లాస్ సిటిజన్ అవుతారు. మతపరమైన చదువులు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాకే చదువుకోవాలి" అని అన్నారు. నిజాలు నిక్కచ్చిగా "కేంద్ర ఆదాయం 6,500 బిలియన్లు. అందులో 3,500 బిలియన్లు రాష్ట్రాలకు ఇస్తుంది. మిగిలినది 3,000 బిలియన్లు. కేంద్రం రుణ సేవ: మంత్రిత్వ శాఖ 2,800 బిలియన్లు, రక్షణ 1,500 బిలియన్లు, పరిపాలన 300 బిలియన్లు, ఎస్ఓఈ 500 బిలియన్లు. నేను ఇక్కడ ఆదాయాలను పెంచి, ఖర్చులను తగ్గించి చూపిస్తున్నాను. నేను నా మాటలను వెనక్కు తీసుకోను. వాస్తవాలను మీ ముందు ఉంచుతున్నాను. కేంద్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలి. వర్తమానంలో ఉన్న పద్ధతిలో ఇది పనిచేయలేదు. మనం పూనుకుని దీన్ని సంస్కరించకపోతే, ఇది ఇలాగే ఉంటుంది" అని  షబ్బర్ జైదీ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో 2019 మే 10 నుంచి 2020 ఏప్రిల్ 8 వరకు షబ్బర్ జైదీ ఎఫ్‌బీఆర్ చైర్మన్‌గా ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల తరువాత పాకిస్తాన్ దివాలా అంచున ఉందా? లేదా ఇప్పటికే దివాలా తీసిందా? అనే చర్చ తీవ్రమైంది.

దివాలా అంత సులువా? పాకిస్థాన్ దివాలా తీసిందా? అనే అంశంపై కాలమిస్ట్ ఫరూఖ్ సలీమ్ ట్వీట్ చేస్తూ దివాలా తీయడమనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ అని వివరించారు. దివాలా అనేది ఒక చట్టబద్ధమైన ప్రక్రియ. దీన్ని రుణ గ్రహీతలు ప్రారంభిస్తారు. ఇది కోర్టు ఆదేశాల ద్వారా అమల్లోకి వస్తుంది. రుణ గ్రహీత అప్పు తీర్చలేనప్పుడు, రుణ గ్రహీతలు ఎవరూ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలను తీసుకోలేదు. కోర్టు నుంచి ఆదేశాలు ఏమీ లేవు. పాకిస్తాన్ తన అప్పులన్నీ తిరిగి చెల్లించిందని ఆయన వివరించారు.

ఇమ్రాన్ పాలనలో రుణ భారం మోపెడు ఒక నివేదిక ప్రకారం, పాకిస్తాన్‌పై ప్రస్తుతం 50.5 లక్షల కోట్ల పాకిస్తాన్ రూపాయల రుణ భారం ఉంది. అందులో ప్రభుత్వ రుణాలు 20.7 లక్షల కోట్ల రూపాయలు. ఇమ్రాన్ పాలనలో పాకిస్తాన్ రుణాలు బాగా పెరిగాయని ఇదే నివేదిక పేర్కొంది. అంటే గత 39 నెలల్లో అప్పు 20.7 లక్షల కోట్ల పాకిస్తానీ రూపాయలు పెరిగింది. దేశం మొత్తం అప్పులో ఇది 70 శాతం పెరుగుదల. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ నిబంధనలు, షరతులు అంగీకారం కాకపోవడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కు రుణం ఇచ్చేందుకు నిరాకరించింది.

నిజంగా దివాలా అంచున ఉందా? ఒక దేశం దివాలా తీయడం, ఒక కంపెనీ దివాలా తీయడం ఒకటి కాదు. దేశ ద్రవ్య విధానం ఆ దేశ పరిస్థితిని తెలియజేస్తుంది. దీంతోపాటు, పెట్టుబడిదారుల విశ్వాసం ఎలా ఉందన్నది కూడా ఒక దేశం దివాలా స్థితిని చెబుతుంది. క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇచ్చే రేటింగులు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది మే నెలలో ఫిచ్ రేటింగ్ సంస్థ, పాకిస్తాన్‌కు రుణాలిచ్చే రిస్క్ బట్టి 'B' రేటింగ్ ఇచ్చింది. దేశ ఆర్థిక చరిత్ర, గత రుణాల చెల్లింపు, ప్రస్తుతం ఐఎంఎఫ్ రుణ చెల్లింపు ప్రణాళికను బట్టి రేటింగ్ సంస్థలు తమ రేటింగ్ ప్రకటిస్తాయి. అంతర్జాతీయ బాండ్ మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవడం కూడా చాలా దేశాలకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

ఎందుకంటే, పెట్టుబడిదారులకు అధిక లాభాలు హామీ ఇస్తారుగానీ కానీ అవి నెరవేర్చలేకపోవచ్చు. ఒక దేశం రుణాలు చెల్లించ లేక పోయినప్పుడు, కొత్త అప్పులు చేస్తుంది లేదా ఆర్థిక విధానాలను మారుస్తుంది. పెట్టుబడిదారులకు నష్టం రాకుండా తమ బాండ్ల ప్రస్తుత ధరలను పెంచుతుంది.ఇన్ని ప్రయత్నాల తరువాత కూడా ఆర్థిక వ్యవస్థ కోలుకోకపోతే , రుణాలు చెల్లించలేకపోతే అప్పుడు ఆ దేశం దివాలా తీసినట్టు లెక్క.2001లో అర్జెంటీనా ఇదే పరిస్థితికి వచ్చింది. తమ దేశం దివాలా తీసినట్టు ప్రకటించింది. పాకిస్తాన్ రుణాలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. కానీ, రేటింగ్ వ్యవస్థలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై కొంత ఆశను ప్రకటించాయి. కరోనా మహమ్మారి తర్వాత పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌లోకి వస్తోందని ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.
Tags:    

Similar News