వామ్మో.. వాళ్ల దగ్గర వందకు పైనే ఉన్నాయంట

Update: 2015-10-23 05:47 GMT
సమీప భవిష్యత్తులో యుద్ధమే వస్తే.. భారత్ మీద అణ్వస్త్రాల్ని ప్రయోగిస్తామంటూ ఈ మధ్యనే పాక్ ప్రముఖుడు పేర్కొనటం..ఈ విషయం పాక్ మీడియా సంస్థ అయిన డాన్ పేర్కొనటం తెలిసిందే. భారత్ మీద ఇన్నేసి మాటలు అనేంత ధైర్యం పాక్ కు ఎందుకు వచ్చింది? ఇప్పటివరకూ ఏ యుద్ధంలోనూ విజయం సాధించలేని పాకిస్థాన్.. ఇప్పుడు మళ్లీ ఏ ధైర్యంతో ఇన్నేసి మాటలు మాట్లాడగలుగుతోంది? పాక్ కు ఉన్న ధైర్యం ఏమిటన్న ప్రశ్నలు చాలామంది మదిలో మెదిలాయి.

పాక్ నోటి వెంట అణ్వస్త్ర ప్రయోగం గురించి మాట రావటం వెనుక..ఆ దేశంలో అణ్వస్త్రాల్ని భారీగా పెంచుకోవటమే కారణంగా భావిస్తున్నారు. గత ఇరవై ఏళ్లుగా అణ్వస్త్రాలపై దృష్టి సారించిన పాక్.. ఇప్పటికే తన వద్ద వందకు పైగా అణ్వస్త్రాల్ని సిద్ధం చేసుకుందని చెబుతున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే దూకుడు కొనసాగించి.. వీలైనన్ని అణ్వస్త్రాల్ని తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని భావిస్తోందట. రానున్న పదేళ్లలో పాక్ అణ్వస్త్రాల విషయంలో భారత్ ను మించి పోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. పదేళ్లలో ప్రపంచంలోనే ఐదో అణ్వస్త్ర దేశంగా మారుతుందన్న అంచనాను అమెరికాకు చెందిన అటామిక్ సైన్స్ అంచనా వేయటం ఆందోళన కలిగించే అంశం.

2025 నాటికి పాక్ వద్ద ఉండే అణ్వస్త్రాల సంఖ్య 250కు మించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ మరింత జాగరూకతతో అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే. భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి రావొచ్చు. తన దగ్గర పోగుపడిన అణ్వస్త్ర బలంతోనే పాక్ మాటల తీరు మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News