పాకిస్థాన్ లోనూ నోట్లరద్దు నిర్ణయం!

Update: 2016-12-20 04:32 GMT
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అనుకోవాలో లేక భారత్ ను ఆదర్శంగా తీసుకుందని భావించాలో కానీ.. భారత్ లా నోట్ల రద్దు బాటనే అనుసరించనుంది పాకిస్థాన్‌. ఈ విషయంలో ఇప్పటికే భారత్ ప్రకటించిన అనంతరం తమదేశంలోనూ నోట్ల రద్దు అంశాన్ని వెనిజులా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి ప్రజల తిరుగుబాటు గమనించి ఆ నిర్ణయాన్ని కాస్త వెనక్కి తీసుకుంది. ఆ సంగతి అలా ఉంచితే... తాజాగా పాకిస్థాన్ కూడా తన దేశంలోని పెద్దనోటును రద్దుచేయాలని నిర్ణయించింది. పాక్ లో కూడా నల్లధనం బాగా పెరిగిపోయిందంట. దీంతో అవినీతిని అంతం చేయడానికి, నల్లధనాన్ని పటాపంచలు చేయడానికి అని పాక్ లోని పెద్దనోటును రద్దుచేయాలని పాకిస్థాన్ సెనేట్ నిర్ణయించింది.

దీంతో పాక్ లోని పెద్ద నోటయిన రూ.5 వేల నోటును రద్దు చేయాలన్న తీర్మానాన్ని పాకిస్థాన్‌ సెనేట్‌ సోమవారం ఆమోదించింది. నల్లధనాన్ని అరికట్టడంకోసం దశలవారీగా రూ.5వేల నోట్లను ఉపసంహరించాలంటూ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ కు చెందిన సెనేటర్‌ ఉస్మాన్‌ సయీఫ్‌ ఉల్లాఖాన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఎగువసభలో మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. రూ. 5వేల నోటు రద్దుతో బ్యాంక్‌ లావాదేవీలు పెరుగుతాయని, బ్లాక్‌ మనీ తగ్గిపోతుందని పాక్ ఎగువసభ సభ్యులు అభిప్రాయపడ్డారు.

కాగా వెనిజుల ప్రభుత్వం కూడా డిసెంబరు 11న తమ దేశంలోని పెద్దనోటైన 100బొలివర్స్ ను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా ఆ నోటును మార్చుకోవడానికి కేవలం 10రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. దీంతో ప్రజలు కష్టాలు భరించలేక, క్యూలలో నిలబడలేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. దీంతో నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రస్తుతానికి వెనిజుల ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే తాజాగా పాకిస్థాన్ కూడా నోట్ల రద్దు దిశగా అడుగులు వేయడం ఆసక్తికరంగా మారింది. దీని పరిణామాలు పాక్ లో ఎలా ఉంటాయనేదానిపై చర్చ మొదలైంది!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News