అణ్వస్త్ర ప్రయోగంపై ఇమ్రాన్ కొత్త మాట విన్నారా?

Update: 2019-09-03 05:36 GMT
కశ్మీర్ పై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో దాయాది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం.. భారత్ ఇమేజ్ దెబ్బ తీసేలా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం మీద అదే పనిగా వ్యాఖ్యలు చేస్తూ అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న పాక్ తాజాగా కొత్త పల్లవిని ఆలపిస్తోంది. కశ్మీర్ కోసం అణ్వస్త్ర యుద్ధానికైనా సిద్ధమేనంటూ బరితెగింపు వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ధీటుగానే రియాక్ట్ కావటం తెలిసిందే.

గతానికి భిన్నంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆ మధ్యన మాట్లాడుతూ..   ఇప్పటివరకూ అణ్వస్త్రాలను ముందు వాడొద్దనే విధానానికి కట్టుబడే ఉన్నాం. కానీ.. రానున్న రోజుల్లో అదే విధానానికి కట్టుబడి ఉండటం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని పేర్కొనటం దాయాదిని ఉలిక్కిపడేలా చేసింది. గతంలో మాదిరి తమ మాటలకు బెదిరే ప్రభుత్వం కాదన్న విషయాన్ని పాక్ గుర్తించినట్లుంది. తాజాగా చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని చెప్పాలి.

తాజాగా లాహోర్ లో సిక్కులను ఉద్దేశించి చేసిన ప్రసంగం సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల్ని పాక్ ముందుగా వాడదని.. భారత్.. పాక్ రెండూ అణ్వస్త్ర దేశాలేనని.. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్నట్లుగా పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వస్త్రాల్ని ముందుగా వాడమని చెప్పటం ద్వారా.. తాము శాంతిమంత్రాన్ని ఆలపిస్తున్నట్లుగా కలర్ ఇవ్వటం.. అదే సమయంలో అణ్వస్త్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలకు ప్రమాదమన్న వ్యాఖ్యలు ద్వారా.. కశ్మీర్ అంశంపై ఇతర దేశాలు కల్పించుకునేందుకు వీలుగా వ్యాఖ్యలు చేశారని చెప్పాలి.

కశ్మీర్ ఎపిసోడ్ లో పాక్ తీరు అంతర్జాతీయ వేదికల మీద ఆ దేశం అభాసుపాలయ్యేలా చేసింది. దీంతో.. ఆత్మరక్షణలో పడిన ఆ దేశం ఇప్పుడు కొత్త తరహా వ్యాఖ్యలకు తెర తీసిందని చెప్పాలి. ఏదోలా కశ్మీర్ అంశంపై ఇతర దేశాలు కాలో.. చేయో పెట్టాలన్నదే తన లక్ష్యమన్నట్లుగా ఇమ్రాన్ మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. శాంతి మంత్రం ఆలపిస్తున్నట్లుగా చేస్తూ.. కొత్త నాటకానికి ఇమ్రాన్ తెర తీశారని చెప్పాలి. మరి.. ఇమ్రాన్ వ్యాఖ్యలపై మోడీ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News