ఉగ్రవాదిని వదిలి, విచారణ అంటూ ఓవరాక్షన్‌!

Update: 2015-04-14 05:34 GMT
   పాకిస్తాన్‌ మరీ ఓవర్‌ చేస్తోంది. నోటితో నవ్వుతూ నొసలితో వెక్కిరించినట్టుగా వ్యవహరించే అక్కడి ప్రభుత్వాల, దేశాధి నేతల తీరులోనే అక్కడి న్యాయ స్థానాలు కూడా డబుల్‌గేమ్‌ ఆడుతున్నాయి. ఉగ్రవాదాన్ని అరికట్టడమే తమ లక్ష్యం అన్నట్టుగా బిల్డప్పులిస్తున్న న్యాయస్థానాలు పరోక్షంగా ఉగ్రవాదులను ప్రోత్సాహిస్తున్నాయి. వారికి బెయిళ్లనిస్తూ.. జైళ్ల నుంచి విముక్తి కల్పిస్తూ సహాయంగా నిలుస్తున్నాయి. మరోవైపు ఉగ్రవాద కాండలపై విచారణ కేసులను వేగవంతం చేయాలని కూడా ఒక మాట అనేస్తున్నాయి!

    ఇటీవలే లష్కరే తోయిబా కమాండర్‌ జకీర్‌ ఉర్‌ రహమాన్‌ లఖ్వీకి అక్కడి కోర్టులు బెయిల్‌ ఇచ్చాయి. భారత ఆర్థిక రాజధాని ముంబై లోని తాజ్‌హోటల్‌పై జరిగిన దాడులకు సూత్రధారి అతడేనని.. అతడిని బయటకు వదిలితే మరిన్ని దాడులకు రూపకల్పన చేసే అవకాశం ఉందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసినా.. పాకిస్తాన్‌ న్యాయస్థానాలు మాత్రం ఆ ఆందోళనలను ఖాతరు చేయలేదు.

    అతడిని వదిలే వరకూ నిద్రపట్టదన్నట్టుగా లఖ్వీని జైలు నుంచి బయటకు పంపించారు. ఈ విషయంలో పాక్‌ ప్రభుత్వానికి భారత్‌ నిరసన తెలిపినా అక్కడ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

    మరి అలా సైలెంట్‌ ఉండే బావుండదని అనుకొన్నారో ఏమో కానీ... ఇప్పుడు పాకిస్తాన్‌ ఉన్నత న్యాయస్థానం ఉగ్రవాదకాండలపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేయాలని దిగువ న్యాయస్థానాలను ఆదేశించింది!

    ముంబై దాడుల విషయంలో నమోదైన కేసుల వ్యవహారాన్ని కూడా తేల్చేయాలని రెండు నెలల్లో విచారణను పూర్తి చేయాలని దిగువకోర్టులను పై కోర్టు ఆదేశించింది. మరి రెండు నెలల్లో విచారణను పూర్తి చేయమనడం ద్వారా పాక్‌ ఇండియాను ఊరడించే ప్రయత్నం చేసినట్టుగా అనుకోవచ్చు.

    అయితే రెండు నెలల్లో విచారణను పూర్తి చేసి.. లఖ్వీ వంటి ఉగ్రవాదులకు పూర్తి స్థాయి ఊరట కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి.

    ముంబై పై దాడుల విషయంలో అతడి ప్రమేయం గురించి ఎలాంటి ఆధారాలూ దొరకలేదని.. కాబట్టి అతడిపై ఆరోపణలు చెల్లవని.. అతడు నిర్దోషి అని కూడా కోర్టులు ప్రకటించే అవకాశాలేమీ లేకపోలేదు! అది పాకిస్తాన్‌ అక్కడ ఏమైనా జరగవచ్చు కదా!
Tags:    

Similar News