ఆ సీఎం చేసిన‌ట్లు బాబు ఎందుకు చేయ‌రు?

Update: 2018-03-03 07:11 GMT
తెలుగోడికి శ‌త్రువు ఎవ‌రు? అంటే.. ఇంకెవ‌రు సాటి తెలుగోడే. సామాన్యులకు ఇది వ‌ర్తించ‌కున్నా.. అధికారంలో ఉన్న నేత‌ల‌కు మాత్రం ఈ విష‌యం ప‌క్కాగా వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎంత‌సేప‌టికి త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నం.. మైలేజీ మీద‌నే యావ త‌ప్పించి.. ప‌వ‌ర్ ఇచ్చిన ప్ర‌జ‌ల గురించి ఆలోచించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు అస్స‌లు క‌నిపించదు. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టం అంతా ఇంతా కాదు. విభ‌జ‌న న‌ష్టాన్ని హోదాతో ఎంతోకొంత పూడ్చుకునే అవ‌కాశం ఉంది.

అయిన‌ప్ప‌టికీ ఆ దిశ‌గా ఏపీ అధికార‌ప‌క్షం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అస్స‌లు క‌నిపించ‌దు. ఎంత‌సేప‌టికి త‌న క్రెడిట్ కోసం పాకులాడ‌టం త‌ప్పించి.. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు క‌లిసిక‌ట్టుగా పోరాడాల‌న్న అంశాన్ని అస్స‌లు ప‌ట్టించుకోని త‌త్త్వం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబులో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడునే తీసుకోండి. ఇప్పుడా రాష్ట్రంలో కావేరీ న‌దీ జ‌లాల వ్య‌వ‌హారంపై  హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. ఏపీతో పోలిస్తే.. త‌మిళ‌నాడులో అధికార‌.. విపక్షాల మ‌ధ్య శ‌త్రుత్వం ఎంత ఎక్కువ‌గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయిన‌ప్ప‌టికీ.. త‌మిళ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల ముందు మ‌రింకేమైనా చిన్న‌వే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది అక్క‌డి అధికార‌ప‌క్షం. కావేరీ న‌దీ జ‌లాల వివాదంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాడే విష‌యంలో చేప‌ట్టాల్సిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించే విష‌యంపై త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి త‌న‌కు తానే ఒక అడుగు ముందుకేశారు. త‌మిళ‌నాడు విప‌క్ష నేత.. డీఎంకే కార్యాచ‌ర‌ణ అధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్  కు తాజాగా ఆయ‌న ఫోన్ చేశారు. అరగంట‌కు పైనే చ‌ర్చించారు. కావేరీ న‌దీజ‌లాల వివాదంపై ఫిబ్ర‌వ‌రి 16న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు త‌మిళ‌నాడు రాష్ట్ర రైతుల‌కు న‌ష్టం చేసేలా ఉన్న నేప‌థ్యంలో.. ఈ వ్య‌వ‌హారంపై ఏం చేస్తే బాగుంటుంద‌న్న విష‌యంపై చ‌ర్చించారు.

అంతేనా.. ఈ అంశంపై ప్ర‌భుత్వం అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హించి అంద‌రి అభిప్రాయాన్ని సేక‌రించింది. రానున్న‌రోజుల్లో ప్ర‌ధాని మోడీని క‌లిసి.. స‌మ‌స్య తీవ్ర‌త‌ను తెలియ‌జేయ‌టంతో పాటు.. త‌మ రాష్ట్ర రైతుల ప్ర‌యోజ‌నాల్ని కాపాడాల‌న్న విష‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకురావాల‌ని డిసైడ్ చేశారు. ఈ ఉదాహ‌ర‌ణ చూసిన‌ప్పుడు అర్థ‌మ‌య్యేది ఒక్క‌టే.. త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఎంత క‌సిగా.. క‌క్ష సాధింపుతో ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయిన‌ప్ప‌టికీ.. అంత ద్వేషం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు వ‌చ్చిన‌ప్పుడు మిగిలివ‌న్నీ ప‌క్క‌న పెట్టేసి.. పార్టీల‌న్నీ ఒక్క‌తాటిపై నిల‌బ‌డ‌టం క‌నిపిస్తుంది.

ఇదే త‌ర‌హాలో ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి త‌ర‌హాలో ఎందుకు ప్ర‌య‌త్నించ‌ర‌న్న‌ది ప్ర‌శ్న‌. హోదా సాధ‌న కోసం ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కు ఫోన్ చేయ‌టం కానీ.. లేదంటే ప్ర‌త్యేకంగా భేటీ అయి.. రాష్ట్ర ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం క‌లిసి ప‌ని చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ఎందుకు తీసుకురారు? ఇదంతా చూసిన‌ప్పుడు ఏపీ ప్ర‌త్యేక హోదాకు మోడీ ఎంత అడ్డంకో.. బాబు లాంటి మైండ్ సెట్ ఉన్న నేత ఉండ‌టం కూడా అంతే అడ్డంకి అనిపించక‌మాన‌దు.
Tags:    

Similar News