పాన్..ఆధార్ లింక్ కు ఆగ‌స్టు 31 డెడ్ లైన్‌!

Update: 2017-07-31 16:34 GMT
ఇన్ క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ గ‌డువును ఆగ‌స్టు 5 వ‌ర‌కు పెంచుతూ చెల్లింపు దారుల‌కు ఆదాయ‌పు ప‌న్ను శాఖ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో ఆర్థిక మంత్రిత్వ‌ శాఖ ఓ కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. ఆగస్టు 31వ తేదీలోపు ఆధార్‌ నెంబర్‌ తో లింక్‌ చేయని పాన్‌కార్డులు చెల్లవని  ఆర్థికమంత్రిత్వ  శాఖ ట్విట్టర్‌ ద్వారా సోమవారం ప్రకటించింది. ఆగస్టు 31వ తేదీలోపు ఆధార్‌నెంబర్‌తో పాన్ కార్డు లింక్‌ చేయకేంటే ఐటీ రిటర్న్స్‌ కూడా చెల్లవని  స్పష్టం చేసింది.

అయితే, పాన్ కార్డు కలిగి ఉన్న‌వారంతా సెక్షన్ 139ఏఏ సబ్-సెక్షన్2 ప్రొవిజన్స్ కింద ఆధార్ నెంబర్ను పాన్ కార్డులకు లింక్ చేసుకోవాలని  ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే గ‌డువును ఆగ‌స్టు 31 వ‌ర‌కు ప్ర‌భుత్వం పొడిగించింద‌ని,  ఈలోగా లింక్ చేయ‌క‌పోతే పాన్ కార్డు ర‌ద్ద‌వుతుంద‌ని రెవిన్యూ కార్య‌ద‌ర్శి హ‌స్ముఖ్ ఆదియా తెలిపారు. ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌డానికి సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కూడా ఆధార్‌, పాన్ లింక్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది.  

జూలై 1 నుంచి ఆధార్‌ - పాన్ కార్డుల లింక్‌ ను ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ చేయ‌క‌పోతే పాన్ కార్డ్ ర‌ద్ద‌వుతుంద‌ని వెల్ల‌డించ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో, వీలైనంత త్వ‌ర‌గా పాన్‌ కార్డును ఆధార్ నెంబ‌ర్‌ తో లింక్ చేయాల‌ని ఆదాయ‌పు పన్ను శాఖ కోరింది.  మరోవైపు ఆదాయ పన్ను దాఖలుకు ఈ నెల 31 తో ముగియనున్న గడువును  ఆగస్టు 5 వరకు పొడిగిస్తున్నట్లు  కేంద్రం  ప్రకటించిన సంగతి తెలిసిందే. 
Tags:    

Similar News