చంద్రబాబుకు ఊరట.. ఎట్టకేలకు పనబాక యాక్టివ్

Update: 2020-12-08 00:30 GMT
ఎవరూ ప్రకటించకుమందే టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ పేరును అనౌన్స్ చేశాడు... క్షేత్రస్థాయిలో పార్టీకి గడ్డు పరిస్థితులున్న సమయంలో అభ్యర్థిత్వాన్ని చెప్పా పెట్టకుండా ప్రకటించడం సంచలనమైంది. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న పనబాకను చంద్రబాబు ఏకంగా తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమెకు రాజకీయ దారులు మూసుకుపోయాయి. దీనిపై కొద్దిరోజులుగా పనబాక సైలెంట్ గా ఉన్నారు. చంద్రబాబు తీరు ఏం బాగోలేదని.. నా డిమాండ్లు పరిష్కరిస్తేనే తిరుపతి ఎంపీగా పోటీచేస్తానని ఆమె అన్నట్టు గుసగుసలు వినిపించాయి.

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోయినా అభ్యర్థిని ముందుగా ప్రకటించి పనబాక లక్ష్మీని చంద్రబాబు బుక్ చేశాడని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీకి గడ్డు రోజులు నడుస్తున్న తరుణంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపి తేది కూడా ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఇంతలో చంద్రబాబు తిరుపతి ఎంపీగా ప్రకటించడంతో ఆమె ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్నారు.

అయితే మాజీ మంత్రి సోమిరెడ్డితో చంద్రబాబు రాయబారం పంపడంతో పనబాక చల్లబడ్డారు. మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. తిరుపతి ఎంపీగా నిలబడేందుకు ఒప్పుకున్నారు.

మొత్తానికి ఇక లాభం లేదనుకొని పనబాక లక్ష్మీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెలుగు దేశం తరుఫునే ఇక చేసేందేం లేక ఎంపీగా ముందుకొచ్చారు. తన గెలుపు కోసం పనిచేయాలంటూ తాజాగా కొందరు సీనియర్ నేతలకు ఫోన్లు చేసి అడిగినట్టు సమాచారం. తన కూతురు పెళ్లి జనవరి 6న పూర్తికాగానే తాను ప్రచారంలోకి దిగుతానని అప్పటివరకు ప్రచారం చేయాలని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.
Tags:    

Similar News