ఫర్లేదే.. తప్పు తెలుసుకొని వెనక్కి తగ్గుతున్నారే నిమ్మగడ్డ..

Update: 2021-02-03 10:30 GMT
అత్యున్నత పదవుల్లో ఉన్న వారు మరింత అలెర్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేయటం.. తన పరిధిని దాటి వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే విమర్శలు మూటగట్టుకుంటున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్.. ఇటీవల తీసుకున్న నిర్ణయం.. ప్రతిపాదించిన వైనం వేలెత్తి చూపించేలా ఉండటమే కాదు.. పలువురు విమర్శలు చేసేలా ఉన్నాయి.

పంచాయితీ రాజ్.. గ్రామీణాభివ్రద్ధి ముఖ్య కార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేది.. ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తో నిర్భంద పదవీ విరమణ చేయించాలన్న ప్రతిపాదన చేయటం తెలిసిందే. పంచాయితీ ఎన్నికలకు 2021 ఓటర్ల జాబితాల్ని రెఢీ చేయించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని జారీ చేసింది. అయితే.. కరోనా వైరస్ తో పాటు ఇతర అంశాల కారణంగా సాధ్యపడలేదు. ఈ సాకును అవకాశంగా తీసుకొని.. ఎన్నికల సంఘం ఆదేశాల్ని అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ చర్యలు కత్తి ఝుళిపించారు.

సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని అభిశంసించటంతో పాటు.. నిర్భంద పదవీ విరమణ కోసం చర్యలు తీసుకోవాలంటూ డీవోపీటీ కమిషనర్ కు లేఖ రాశారు. తప్పు చేసినట్లుగా అభిప్రాయపడ్డ ఎన్నికల కమిషనర్.. అధికారుల్ని అభిశంసించటం వరకూ ఎవరూ తప్పు పట్టరు. అందుకు భిన్నంగా వారిని నిర్భంద పదవీ విరమణ తీసుకోవాలన్న ప్రతిపాదన సరైనది కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది.ఇలాంటివేళ.. నిమ్మగడ్డ తనకు తాను.. తన పరిధిని దాటి ప్రతిపాదన చేశానా? అన్న సందేహం వచ్చిందో ఏమో కానీ.. తన ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. కీలక స్థానాల్లో ఉన్న వారు.. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం సరైనది కాదన్న విషయాన్ని నిమ్మగడ్డ ఇప్పటికైనా తెలుసుకున్నారంటారా?
Tags:    

Similar News