నెల్లూరు స్టేట్ కోవిడ్ సెంటర్లో రోగి ఆత్మహత్య కలకలం

Update: 2020-09-08 17:30 GMT
రాష్ట్రంలో కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. కరోనాపై కట్టడిలో కలెక్టర్లు, వైద్యాధికారులు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని జగన్ ఆదేశించారు. ఓ వైపు, సీఎం జగన్ కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ...కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. స్టేట్ కోవిడ్ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన నెల్లూరు కోవిడ్ ఆస్పత్రి జీజీహెచ్ లో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. స్టేట్ కోవిడ్ సెంటర్‌ అయిన నెల్లూరు జీజీహెచ్ నుంచి కావూరు వెంకటేశ్వరరెడ్డి(50) అనే కరోనా పాజిటివ్ పేషెంట్ కొద్ది రోజుల క్రితం అదృశ్యంక కావడం కలకలం రేపుతోంది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వెంకటేశ్వరరెడ్డి కనిపించకుండా పోయాడాని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతుండగానే నెల్లూరు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డులో కరోనా సోకిన మహిళ ఆత్మ హత్య ఘటన పెను సంచలనం రేపింది.

నెల్లూరులోని మూలపేటకు చెందిన పరమేశ్వరమ్మ ఐసోలేషన్ వార్డులో చీరకొంగుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కరోనా బారినపడ్డ పరమేశ్వరమ్మకు చికిత్స అందిస్తున్నామని, అయితే, వాంతులు తగ్గకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కాగా, జీజీహెచ్ లో సగం సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని, ఆస్పత్రిలో రోగుల కదలికలపై సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ నుంచి మూర్తి, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, నోడల్ అధికారి శీనా నాయక్ ల బదిలీ వల్ల జీజీహెచ్ పై పర్యవేక్షణ కొరవడిందని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News