పంజాగుట్ట చిన్నారి మృతి కేసు మిస్టరీ వీడింది.. హత్యకు కారణం ఇదే !

Update: 2021-11-13 14:30 GMT
పంజాగుట్ట బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. చిన్నారి మృతదేహాన్ని వదిలివెళ్లిన మహిళను , ఆమెతో పాటు ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు కలిసి చెన్నైలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడి వెళ్లి పట్టుకున్నారు.

వీరితో ఒక బాబు సైతం ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ముగ్గురిని సాయంత్రం లోపు చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు తెలిపారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పాతబస్తీకి చెందిన మహిళ, తన భర్త చనిపోవడంతో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అప్పటికే ఆమెకు ఓ కూతురు ఉంది. కూతురు విషయంలో మహిళతో ఆమె ప్రియుడు తరచూ గొడవపడేవాడు.

దీంతో ఆ చిన్నారిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని తల్లి భావించింది. కూతురును తరచూ కొట్టడం వల్ల గాయాలతో బాలిక అనారోగ్యం పాలైంది. ఈ క్రమంలో బాలిక మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌ లోని పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలో ఈ నెల 4న ఐదేళ్ల బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో హత్యగా తేల్చిన పోలీసులు అన్ని వైపుల నుంచి దర్యాప్తు మొదలుపెట్టారు.

బాలిక హత్యకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో, పోలీసులు ద్వారకాపురి కాలనీ సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. బాలిక మృతదేహాన్ని గుర్తు తెలియని ఓ మహిళ వదిలేసి వెళ్లినట్లుగా గుర్తించారు. ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, ఓ మహిళ బాలికను ఎత్తుకుని ఆటో ఎక్కి ద్వారకాపురి కాలనీ సమీపంలో దిగిందని పోలీసులు తెలుసుకున్నారు. బాలిక మృతదేహాన్ని అక్కడ పడేసిన మహిళ ఆ తర్వాత మెహదీపట్నం వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో తేలింది.

మహిళ అక్కడి నుంచి ఎటువైపు వెళ్లిందనే వివరాలను సేకరించిన పోలీసులు, బాలిక కుటుంబ సభ్యులే ఈ హత్య చేశారా అనే కోణంలోనూ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన బస్సులో లక్డీకపూల్లో దిగిన నలుగురు, అక్కడ ఆటో మాట్లాడుకుని ద్వారకాపురి కాలనీ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు.

ఓ కుటుంబంలా ఆటోలో వచ్చి మృతదేహాన్ని పడేసి మెహదీపట్నం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ నేపథ్యంలో పోలీసులు మెహదీపట్నంతో పాటు లక్డీకపూల్లోని ట్రావెల్స్ కార్యాలయాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి,నిందితుల కోసం 4 పోలీస్‌, 3 టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో గాలించి హత్య కేసును చేధించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ఛేదించడం కష్టంగా మారిందని.. అయినా ఛాలెంజ్‌కు తీసుకున్నామని తెలిపారు.


Tags:    

Similar News