పైకి బీజేపీతో తెగతెంపులు... బీజేపీ మంత్రి కుటుంబానికి మాత్రం బాబు ప్రభుత్వంలో కీలకమైన పదవులు. ఇదేం రాజకీయం అని వైసీపీ చేసిన ఆరోపణలకు టీడీపీకి గట్టి షాక్ తగిలింది. తమ అంతర్గత బంధం ప్రజల్లోకి ఎక్కడ పోతుందో అని సత్వర చర్యలు తీసుకున్నట్లు తాజా సంఘటనతో అర్థం అవుతోంది.
*నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఉండటం వల్ల - ముఖ్యమంత్రి చేస్తున్న ధర్మపోరాటంపై అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే రాజీనామా చేయదలచుకున్నాను. నా వల్ల ప్రభుత్వానికి నష్టం కలగవద్దని ఈ నిర్ణయం తీసుకున్నాను* అని పరకాల వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు మీద పరకాల ఈగ కూడా వాలనివ్వడం లేదు. బాబు కోసం తన పదవిని త్యాగం చేసేంత అనుబంధం దేనివల్ల ఏర్పడిందో వివరిస్తే బాగుంటుంది అని ఈ రాజీనామాపై విమర్శలు వస్తున్నాయి.
జగన్ వ్యాఖ్యలతో మనస్తాపం చెందినట్లు పరకాల పేర్కొన్నారు. ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యత. అందులో నిజం లేకపోతే ఖండించాలి. కానీ ఇలా రాజీనామాలు చేసి త్యాగాలతో రహస్యాలు బయటపెట్టుకున్నారు పరకాల. రాజీనామా సందర్భంగా నాలుగేళ్లు రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. జగన్ ఆరోపణల వల్లనే ప్రభుత్వానికి నష్టం కలగకూడదని ఏకంగా లేఖలో పేర్కొన్నారంటే... ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇంకా ఈ రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించాల్సి ఉంది.