రాప్తాడులో రాజ‌కీయ ర‌చ్చ‌.. స‌వాళ్ల పాలిటిక్స్‌.. ప‌రిటాల సునీత ఫైర్‌

Update: 2022-03-14 14:44 GMT
అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం రాప్తాడులో రాజ‌కీయం గరం గ‌రంగా మారింది. అధికార‌, విప‌క్షాల స‌భ్యుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ యుద్ధం తెర‌మీదికి వ‌చ్చింది. ``నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకుందాం..రాం!`` అంటూ.. టీడీపీ నాయ‌కురాలు.. మాజీ మంత్రి, ప‌రిటాల సునీత‌.. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డికి భీక‌ర‌మైన స‌వాల్ రువ్వారు.  ఎమ్మెల్యేను చెంచాతో పోల్చారు. ``వైసీపీ చెంచాలు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా``రని మాటలను అదుపులో పెట్టుకోవలని సునీత హెచ్చరించారు.

భారీ నిర‌స‌న‌!

పేరూరు డ్యాం కాలువలకు భూములిచ్చిన రైతులకు ఇంత వరకు డబ్బులు చెల్లించలేదన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని రామగిరి మండలం కేంద్రంలో రైతుల స‌మ‌స్య‌ల‌పై సునీత‌, ఆమె కుమారుడు, యువ నేత ప‌రిటాల శ్రీరాంలు.. నిరసన ప్రదర్శనకు దిగారు.

రైతులతో కలిసి సుమారు 100 ట్రాక్టర్లతో తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు.  ఈ సంద‌ర్భంగా సునీత మాట్లాడుతూ.. సీఎంగా జగన్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క కుంటుంబం సంతోషంగా లేదని పరిటాల సునీత విమర్శించారు. అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారని మండిపడ్డారు.

రైతుల‌కు ఏం చేశారు!

రైతులకు అన్యాయం జరుగుతున్నా.. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రిప్ పరికరాలు ఇంత వరకు రైతులకు ఇవ్వలేదు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్‌తో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ అందించలేదని మండిపడ్డారు.

వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నామంటూ సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆచరణలో మాత్రం శూన్యమని పరిటాల సునీత దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదని ఆరోపించారు.

ఎమ్మెల్యే క‌బ్జారాయుడు!

రాప్తాడుకు పేరుకే వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.. కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. పేరూరు డ్యాంకు కోసం నాడు టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తే.. వాటి పక్కదోవ పట్టించారని ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమాలకు, కబ్జాలకు అంతు లేకుండా పోయిందని సునీత నిప్పులు చెరిగారు.

టమోట మండీల వద్ద కమీషన్లు, హైవేలో భూములు ఆక్రమించుకుం టున్నారని ఆరోపించారు. ఎక్కడ భూమి కన్పిస్తే అక్కడ కబ్జాకు పాల్పడుతున్నారు. రైతులను ఆదుకుంది చంద్రబాబేన‌ని తెలిపారు. న‌ష్టపోయిన‌ పంటల‌కు బీమా పరిహారం ఇచ్చారు. ఎస్సీ,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్ అందించారని పేర్కొన్నారు.

శ్రీరాం.. కామెంట్స్‌
రైతుల సమస్యలపై మాట్లాడే నాయకులు వైసీపీలో లేరని ప‌రిటాల శ్రీరాం విమర్శించారు. రైతుల సమస్యలను రైతులే పరిష్కరించుకోవాలన్నారు. రైతు కలిసిక‌ట్టుగా పోరాటం చేసి సాధించుకోవాలని కోరారు. జగన్ రాక్షస పాలనను గమనించాలని కోరారు. రైతులు, కార్యకర్తలు రోడ్లెక్కాలి.. ప్రభుత్వ మెడలు వంచాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు.

సీఎం జగన్ మూడు రిజర్వాయర్లకు కొబ్బరి కాయకొట్టారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదని ఎద్దేవా చేశారు.. ఇప్పటి వరకు ఎందుకు వీటిని పూర్తి చేయలేకపోయారని నిలదీశారు. ఎమ్మెల్యేకు దమ్ము ధైర్యం ఉంటే సీఎంను ఒప్పించి వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News