పార్టీ చేసుకుంటూ నిరసన.. అదిరిపోయిన ఆలోచన

Update: 2022-07-07 04:55 GMT
నిరసన తెలుపాలంటే అందరూ చేసేలా చేస్తే ఎవరూ పట్టించుకోరు. సమ్ థింగ్ స్పెషల్ ఉండాలి. అది ప్రజల్లో ఆసక్తి రేపాలి.. ప్రభుత్వాన్ని కదిలించాలి.. మీడియాలో హైలెట్ అవ్వాలి. ఇప్పుడు అదే చేశారు ఈ ప్రజలు.

తమ సమస్యను తాము ఎంజాయ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి బుల్లెట్ లా తీసుకెళ్లారు.  గుంతలతో నిండిన రోడ్ల దుస్థితిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో  మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో నివాసితులు ఒక ప్రత్యేకమైన నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనుప్పూర్‌ను బిజూరి మనేంద్రగఢ్‌తో కలిపే రహదారి అధ్వాన్నంగా ఉందని ప్రజలు వినూత్న నిరసన తెలిపారు. ఆ ప్రాంత నివాసితులు రోడ్డుపై ఉన్న పెద్ద గుంత వద్ద మురికి నీళ్లపై కుర్చీలపై కూర్చొని, ఆ తర్వాత పేరుకుపోయిన బురద నీటిలో కాళ్లు ముంచి పార్టీ చేసుకున్నారు. ఈ వర్షాలకు తమ పరిస్థితి ఇదీ అంటూ వినూత్న నిరసన తెలిపారు.

వాతావరణాన్ని కాస్త సుందరంగా కూడా తీర్చిదిద్దారు. ప్లే చేయడానికి బీచ్ బాల్స్‌తోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్స్ మ్యూజిక్ ప్లే చేసే కొన్ని డిస్కో లైట్లను కూడా ఉంచారు. పార్టీ సంగీతంతో మూడ్‌ని సెట్ చేస్తూ నివాసితులు పానీయాలు.. స్నాక్స్‌లను ఆస్వాదించడం విశేషం. టపాసులు పేల్చి ఈ నిరసనను పతాకస్థాయికి తీసుకెళ్లారు.

రోడ్డుపై ఉన్న చిన్న చిన్న గుంతల్లో మొక్కలు నాటడం కూడా వీడియోలో కనిపిస్తుంది. గత సంవత్సరం ఇదే విధమైన ప్రతీకాత్మక నిరసన  జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లా వాసులు చేశారు.

తమ గ్రామానికి వెళ్లే బురదతో కూడిన రహదారిపై రోడ్డు దుస్థితిని ఎత్తిచూపడానికి వరి నాటారు. ఇప్పుడు భోపాల్ లో ఏకంగా బురద గుంతల్లో పార్టీ చేసుకొని ప్రభుత్వానికి షాకిచ్చారు.
Tags:    

Similar News