ట్రాప్ లో పడకూడదనే విశాఖ నుంచి పవన్ వచ్చేశారా?

Update: 2022-10-18 05:20 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు.. చేతలు సూటిగా.. స్పష్టంగా ఉంటాయి. అప్పుడప్పుడు ఆవేశాన్ని ప్రదర్శించే ఆయన.. ఇటీవల కాలంలో అందుకు భిన్నంగా ప్రతి అంశంలోనూ పరిణితిని ప్రదర్శిస్తున్నారు. తొందరపాటు తగదన్నట్లుగా ఆయన తీరు ఉంటోంది. ఎంతలా రెచ్చగొట్టినా రెచ్చిపోయే పనులకు చెల్లుచీటీ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు.. ప్రత్యర్థులు విసిరే వలలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విశాఖపట్నం నుంచి మంగళగిరికి వచ్చేశారని జనసైనికులు చెబుతున్నారు. ప్రజావాణి ప్రోగ్రాంలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన పవన్ కు అనూహ్య పరిణామాలు ఎదురుకావటం తెలిసిందే.

ఆయన విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనసైనికుల కొందరు చెలరేగిపోవటం.. ఏపీ మంత్రులకు చుక్కలు కనిపించటం లాంటివి చోటు చేసుకున్నాయి. అంతలోనే.. జనసేన కార్యకర్తలు పలువురిని అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోవటం.. అందులో భాగంగా ఆయన బస చేసిన నొవాటెల్ హోటల్ లోనూ తనిఖీలు నిర్వహించటంతో పాటు.. పవన్ వాడిన కారును కూడా సోదా చేయాలని  కోరిన వైనం తెలిసిందే. తాను ఆవేశానికి గురయ్యేందుకు అవకాశం ఉన్న ప్రతి విషయాన్ని టచ్ చేసినప్పటికీ.. పవన్ మాత్రం వారు అంచనా వేసినట్లుగా కాకుండా అత్యంత సంయమనాన్ని పాటించారు.

నిజానికి పవన్ కు ఎదురైన పరిస్థితులే చంద్రబాబుకు ఎదురైనా.. ఆయన కచ్ఛితంగా పోలీసులపై ఫైర్ కావటంతో పాటు.. వారిని ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు. పవన్ మాత్రం అందుకు భిన్నంగా పోలీసులపై తనకు ఎలాంటి శత్రుత్వం లేదని.. వారి పరిస్థితిని తాను అర్థం చేసుకుంటానన్నట్లుగా వ్యవహరించి.. కొందరు పోలీసుల్లో అంతర్మధనం మొదలయ్యేలా చేశారంటున్నారు. పోలీసులు సైతం తాను రెచ్చిపోయేందుకు చాలానే ప్రయత్నాలు చేశారంటూ.. 'జనసైనికుల్ని కవ్వించారు.

వారి ప్లాన్ లో భాగంగానే ఇదంతా జరిగింది. రెచ్చగొడితే రెచ్చిపోతానని నన్ను కూడా ఒక ఐపీఎస్ అధికారి రెచ్చగొట్టాలని చూశారు. శాంతిభద్రతల సమస్య వస్తే మూసేద్దాం అనుకున్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వాడిని. వైసీపీ కోరుకునే హింసను ఇవ్వలేం' అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. తెర వెనుక ఏం జరుగుతుందన్న విషయానికి సంబంధించిన క్లూ ఇచ్చారని చెప్పాలి.

ఈ కారణంతోనే కావొచ్చు.. అరెస్టు చేసిన తన వారిని విడుదల చేసే వరకు విశాఖను విడిచిపెట్టనని చెప్పిన పవన్.. తనను ఉచ్చులో పడేసేందుకు పన్నిన వలను గుర్తించి.. అందులో నుంచి ఒడుపుగా బయటకు వచ్చే తీరులో వ్యవహరించారని చెబుతున్నారు. మైండ్ గేమ్ ను అర్థం చేసుకోలేక.. మూర్ఖంగా వ్యవహరిస్తారన్న ప్రత్యర్థుల అంచనాను పవన్ చాలా బాగా పసిగట్టినట్లుగా చెబుతున్నారు. తాము రెచ్చగొడితే రెచ్చిపోయి.. రచ్చ రచ్చ చేసేయటం ద్వారా.. చూశారా.. పవన్ తీరు.

వారి పార్టీకి ఓట్లు వేస్తే పరిస్థితులు ఎంతలా ఉంటాయన్న ప్రచారానికి తెర తీసేలా ప్రయత్నం జరిగినట్లుగా చెబుతున్నారు. తాను ఏపీ డెవలప్ మెంట్ కు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తానే కానీ.. అనవసరమైన రచ్చకు కాదన్న విషయాన్ని పవన్ తన తీరుతో స్పష్టం చేశారని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. జగన్ అండ్ కో విసిరిన ట్రాప్ లో పడకూడదన్న ఉద్దేశంతోనే విశాఖ నుంచి వెనక్కి వచ్చేశారే తప్పించి.. వెన్ను చూపించి కాదన్న మాట బలంగా వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News