బద్వేలు ఉపఎన్నికతోనే పవన్ మొదలుపెట్టేయచ్చు

Update: 2021-10-02 12:30 GMT
జగన్మోహన్ రెడ్డి తాట తీసే అవకాశం పవన్ కల్యాణ్ కు వచ్చేసింది. వైసీపీ వాళ్ళ తాటి తీసి మోకాళ్ళ మీద కూర్చోబెడతానని నాలుగు రోజుల క్రితమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ ఉద్దేశ్యంలో వైసీపీ నేతలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని అర్ధం చేసుకోవాలి. పవన్ ఇలా వార్నింగ్ ఇచ్చారో లేదో వెంటనే ఆ అవకాశం వచ్చేసింది. పవన్ వార్నింగ్ ప్రకారం వైసీపీ నేతల తాటతీసే సమయానికి ఇంకా రెండున్నరేళ్ళుంది.

కానీ కేంద్ర ఎన్నికల కమీషన్ పుణ్యమా అని పవన్ కు ఆ సువర్ణావకాశం బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక రూపంలో వెంటనే వచ్చేసింది. ఈనెల 30వ తేదీన బద్వేలు ఉపఎన్నిక పోలింగ్ జరగబోతోంది. మిత్రపక్షాల తరపున ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే విషయం ఇంకా తేలలేదు. అయితే ఎలాగైనా బీజేపీని ఒప్పించి తన అభ్యర్ధిని పవన్ రంగంలోకి దింపగలిగితే చాలు. జగన్ తాట తీయటానికి రంగం సిద్ధమైపోయినట్లే. ఆరునూరైనా సరే వచ్చిన అవకాశాన్ని పవన్ విడిచిపెట్టకూడదు.

పోయిన ఎన్నికల్లో బద్వేలులో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ వెంకటసుబ్బయ్య తన సమీప టీడీపీ అభ్యర్ధి ఓబుళాపురం రాజశేఖర్ ను సుమారు 40 వేల ఓట్ల తేడాతో ఓడించారు. అప్పట్లో ఇక్కడ జనసేన పోటీచేయకుండా అప్పటి మిత్రపక్షమైన బీఎస్పీకి సీటును వదిలేసింది. అప్పట్లోనే ఇక్కడ జనసేన పోటీచేసుంటే ఏమయ్యుండేదో. అందుకే ఇపుడు మాత్రం అలాంటి పొరబాటు చేయకుండా జనసేన తరపునే పవన్ అభ్యర్ధిని రంగంలోకి దింపాలి. అభ్యర్ధిని ప్రకటించటమే కాకుండా బద్వేలులోనే పవన్ క్యాంపు వేసి తానేంటో జగన్ కు తెలిసేట్లు చేయాలి.

ఎప్పుడో తీస్తానని చెప్పిన వైసీపీ నేతల తాట బద్వేలు ఉపఎన్నికతోనే పవన్ మొదలుపెట్టేయచ్చు. సాధారణ ఎన్నికలో వైసీపీనే గెలిచింది కాబట్టి రేపటి ఉపఎన్నికలో కూడా తమ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధే గెలుస్తుందని జగన్ అనుకుంటున్నారు. అలాకాకుండా పవన్ తన సత్తా ఏమిటో జగన్ కు తెలియచెప్పాలి. అప్పట్లో వైసీపీకి ఎంతైతే మెజారిటి వచ్చిందో అంతే మెజారిటిని రేపటి ఎన్నికలో తమ అభ్యర్ధికి పవన్ తెప్పించాలి. అప్పుడే జగన్ అండ్ కో కు తన తడాఖా ఏమిటో లోకానికి పవన్ తెలిపినట్లవుతుంది.

నిజంగానే బద్వేలులో జనసేన అభ్యర్ధి బంపర్ మెజారిటితో గెలిస్తే ఇక అంతే సంగతులు. పైగా బీజేపీ నేతలతో జరిగిన భేటీలో బద్వేలలో బలిజలు(కాపులు) చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి పోటీచేసే అవకాశం తమకే ఇవ్వాలని పవన్ గట్టిగా డిమాండ్ చేశారు. బలిజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తామే పోటీచేస్తామని పవన్ చెప్పటం ఏమీ బావోలేదు. జగన్ తాట తీయాలని పవన్ అనుకున్నాక బలిజలేంటి, రెడ్లు, కమ్మలు బ్రహ్మలు, రాజులు ఇలా సామాజికవర్గాలతో సబంధం లేకుండానే పని మొదలుపెట్టేయాలి. కాబట్టి పవన్ కు మనం ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.


Tags:    

Similar News