జగన్ సర్కారుకు షాకిచ్చేలా గుంకలాం లేఔట్ లో పవన్ వెలికి తీసిన వాస్తవం ఇదే

Update: 2022-11-14 03:55 GMT
చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం పోలిక లేదన్న విషయాన్ని కళ్లకు కట్టేలా అందరికి చూపించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమాన్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. పేదలకు పెద్ద ఎత్తున జగనన్న ఇళ్ల పేరుతో ఇళ్లను అందించినట్లుగా ప్రచారం చేసుకోవటం తెలిసిందే. ఈ కార్యక్రమం ఎలా సాగిందన్న విషయాన్ని  అందరికి అర్థమయ్యేలా చేయటంతో పాటు.. జగన్ సర్కారు డొల్లతనాన్ని తెర మీదకు తీసుకురావటమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఆదివారం 'జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు' కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇందులో బాగంగా విజయనగరం వెళ్లిన ఆయన.. తాను ముందుగా ప్రకటించిన గుంకలాం లేఔట్ ను స్వయంగా పరిశీలించేందుకు పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున జన సందోహం స్వాగతం పలికింది.

పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల మధ్య తాను చెప్పిన లేఔట్ కు చేరుకున్నారు. దీన్ని ఎంపిక చేసుకోవటానికి కారణం.. ఏపీ వ్యాప్తంగా జగన్ సర్కారు అమలు చేస్తున్న ఇళ్ల ప్రోగ్రాంలో ఇదే అతి పెద్దది. ఇక్కడ మొత్తం 397 ఎకరాల్లో 12,301 ప్లాట్లు వేసి.. 10,800 మందికి ఇళ్లను మంజూరుచేశారు.

ఈ మొత్తం 291 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. ఈ భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ లేఔట్ లో మొత్తం 42 ఇళ్లు పూర్తి అయినట్లుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చెబుతోంది. అయితే.. పవన్ కల్యాణ్ పర్యటనలోతేలిందేమిటంటే.. ప్రభుత్వం  చెబుతున్న దానికి భిన్నంగా ఒక్కటంటే ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదని తేల్చటమే లక్ష్యం. అందుకు తగ్గట్లే పవన్ తన టూర్ తో ఆ పని పూర్తి చేశారని చెప్పాలి.

ఇక.. రైతుల నుంచి భూమిని సేకరించినట్లు చెబుతున్నా.. అందులోనూ భారీ మోసం జరిగిందని చెబుతున్నారు. రైతుల నుంచి ఎకరం రూ.2-4 లక్షల మద్య కొనుగోలు చేసి.. వాటిని ప్రభుత్వానికి రూ.18 -రూ.30 లక్షల మధ్య అమ్మిన వైనాన్ని ప్రస్తావించారు. ఇలా ప్రజాధనాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు.

పేదోడి సొంతింటి కలను తీర్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు ఒక్కో ఇంటి కోసం కేటాయించిన రూ.1.8 లక్షలను ఇళ్ల నిర్మాణం కోసం ఖర్చు చేయకుండా.. ఇతర కార్యక్రమాలకు వినియోగించినట్లుగా ఆరోపించారు.  ఈ కారణంతోనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావట్లేదన్నారు. ఇళ్ల నిర్మాణానికి కరోనా కారణమని చెబుతున్నారని.. కానీ వైసీపీ నేతల దోపిడీ కారణంగానే ఇలాంటి పరిస్థితి ఉందని పవన్ ఫైర్ కావటం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News