వాళ్లకు ఉరి.. ఆమెకు పెళ్లి

Update: 2020-01-11 16:23 GMT
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ అత్యాచార ఘటన దోషులు ఉరికొయ్య అంచున ఉన్నారు. కోర్టు తీర్పు ప్రకారం వారికి ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాల్సి ఉంది. దోషుల్లో ఇద్దరు క్యురేటివ్ పిటిషన్ వేయడంతో ఇంకా వారికి భూమ్మీద నూకలుండే అవకాశాలున్నాయి. అయితే, దోషులకు ఉరి తీయాల్సిన తలారి మాత్రం వారిని ఉరి తీసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ నలుగురిని ఉరి తీస్తే తనకు అందబోయే లక్ష రూపాయలతో తన జీవితంలో అత్యంత కీలకమైన పని చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అవును.. ఆ నలుగురిని ఉరితీస్తే ప్రభుత్వం తనకు ఇచ్చే రూ. లక్ష పారితోషికంతో తన కుమార్తెకు పెళ్లి జరిపిస్తానంటున్నాడాయన.

మీరట్‌కు చెందిన తలారి పవన్ జలాద్ నిర్భయ హంతకులను ఉరి తీయనున్నారు. అందుకు ఆయనకు రూ. లక్ష పారితోషికం ఇస్తారు. ఈ నేపథ్యంలో ఆయన తనకు ఈ అవకాశం  ఇచ్చినందుకు యూపీ ప్రభుత్వానికి - తీహార్ జైలు అధికారులకు - భగవంతుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పాడు. తన కుమార్తె వివాహానికి తనకు డబ్బులు అవసరమని - ఈ కేసులో దోషుల ఉరితీత కోసం  తాను నాలుగు నెలలుగా వేచి ఉన్నానని అన్నాడు.

కాగా మీరట్ అధికారులు పవన్‌ కు  ప్రత్యేకంగా ఓ ఇంటిని కేటాయించి.. జిల్లా వదిలి వెళ్లకుండా చూస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు యూపీ ప్రభుత్వం నెలకు కేవలం 5 వేల రూపాయల జీతం ఇస్తోంది. ఆయన ఉంటున్న ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. అందుకే ఈ కేసులోని నలుగురు దోషుల ఉరితో వచ్చే డబ్బు కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఒక్కో వ్యక్తినీ ఉరి తీసినందుకు 25 వేల రూపాయలు చెల్లిస్తారని - ఇప్పుడు నలుగురు దోషులున్నారు గనుక తనకు మొత్తం లక్ష వరకు ‘ రివార్డు ‘ వస్తుందని ఆశగా చెప్పాడు. 
Tags:    

Similar News