ప్రస్తుతానికి బీజేపీతో.....క్లారిటీ ఇచ్చేశారా... ?

Update: 2022-01-12 06:52 GMT
రాజకీయాల్లో ఉండాలే కానీ ఏదో నాటికి పండకపోరు. ఆ మాటకు వస్తే కాదేదీ రాజకీయాలకు అనర్హం అని కూడా చెప్పవచ్చు. అయినా కానీ గాలి సర్వాంతర్యామి అయినట్లుగా రాజకీయాలు కూడా అదే తీరు కదా. వాటికి ఫలానా ఫీల్డ్ కే పరిమితమని  అని రాసుందా ఏంటి. అందువల్ల రాజకీయాన్ని ప్రత్యేకంగా స్కూల్లో చదువుకోనవసరం లేదు. కాస్తా లౌక్యం, ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలిసి ఉంటే చాలు రాజకీయం అబ్బేసినట్లే.

సినిమా నటుడు కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా బాగానే రాణిస్తున్నారు. ఆయన ఆవేశపరుడు అన్న ముద్ర ఉంది. కానీ ఆయన ఇపుడు ఆలోచనాపరుడు కూడా అయ్యారు.  నీళ్ళు ఏమిటి, పాలు ఏమిటి అన్నది పవన్ బాగానే గ్రహిస్తున్నారు. అంతే కాదు మాట అదుపు, మాట పొదుపు అన్న సూత్రాన్ని కూడా బాగానే వంట బట్టించుకున్నారు అని చెప్పాలి.

లేకపోతే చంద్రబాబు వన్ సైడ్ లవ్ అంటూ కుప్పంలో మాట్లాడిన దానికి కాస్తా ఆలస్యంగా అయినా పవన్ బాగానే  రియాక్షన్ ఇచ్చారు. అయితే అది పాము చావకుండా కర్ర విరగకుండా ఉంది. ఆయన వర్చువల్ విధానం ద్వారా తన పార్టీ నేతలతో మాట్లాడిన దాన్ని జాగ్రత్తగా గమనిస్తే పొత్తులు ఇపుడు అప్రస్తుతం అన్నారు. అంటే పొత్తుల మీద సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారన్న మాట. అంతే కాదు ప్రస్తుతానికి బీజేపీతో పొత్తులో ఉన్నామని అంటున్నారు.

అంటే ఇది ప్రస్తుతం, మరి భవిష్యత్తులో పొత్తులు  అంటే అది రివీల్ చేయకుండా అలాగే సస్పెన్స్ ఉంచేశారు అన్న మాట. ఇక అవుట్ రేట్ గా టీడీపీతో పొత్తు లేదు అని ఎక్కడా పవన్ అనడంలేదు. అదే టైమ్ లో ముందు పార్టీని నిర్మించుకుందామని చెప్పారు. అది బాగానే ఉంది. ఏ పార్టీ నేత అయినా చేయాల్సిన సూచనే అది. మనమే సొంతంగా అధికారంలోకి వద్దాం అన్న దాని మీద గట్టిగా భరోసా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది.

ఏది ఏమైనా పొత్తుల పేరిట కొన్ని పార్టీలు  మైండ్ గేమ్ ఆడుతున్నాయని పవన్ అనడం విశేషమే. ఆ మైండ్ గేమ్ టీడీపీది అయితే దానిని మించిన గేమ్ జనసేన దగ్గరా ఉంది మరి. అన్ని పార్టీలూ పొత్తుల పేరిట తమను కోరుకుంటున్నాయని పవన్ చెప్పుకోవడం బాగానే ఉన్నా తమ పార్టీ కరెక్ట్  రూట్ ఏంటో, తమ పొలిటికల్ క్లారిటీ ఏంటో ఈ రోజుకీ పార్టీ జనాలకు చెప్పకుండా ఈ దాగుడు మూతల రాజకీయం ఆడడం మంచిది కాదేమో అన్న చర్చ కూడా వస్తోంది.

ఏది ఏమైనా కుప్పంలో బాబు చేసిన వన్ సైడ్ లవ్ కామెంట్స్ కి పవన్ రియాక్షన్ ప్రస్తుతానికి బీజేపీకి కూడా ఆనందం కలిగించే విషయమే. ఎందుకంటే బీజేపీతో ప్రస్తుతానికి పొత్తులో ఉన్నామని ఆయన ఇంకా నొక్కి వక్కాణిస్తున్నారు కాబట్టి. అదే టైమ్ లో భవిష్యత్తు ఆశలను అలాగే ఉంచి టీడీపీకి కూడా ఆనందం కలిగించారు. ఆ విధంగా పవన్ తనదైన మార్క్ పాలిటిక్స్ ని ప్రదర్శించారు అంటున్నారు.

అయినా బీజేపీ తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంది. మరే పార్టీతో లేదు, అసలు వద్దు అంటోంది. మేమే ఏపీలో తృతీయ పక్షంగా ఉంటాం, అధికార వైసీపీకి సరైన ఆల్టర్నేషన్ అంటోంది. మరి జనసేనాని కూడా అంత క్లారిటీగా ఎందుకు చెప్పడం లేదు అన్నదే చర్చ. పైగా ఆయన ఎవరెవరో పొత్తులతో మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు తప్ప డోర్లు తెరచి ఆ అవకాశం మనమే ఇస్తున్నామని ఎందుకు గుర్తించడం లేదు అన్నది కూడా ప్రశ్నగా ఉంది.

మేము ఎవరితో పొత్తులు పెట్టుకోం, మాకు బీజేపీ ఒక్కటి చాలు అని ఎందుకు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా పవన్ అన్ని ఆప్షన్లను తన వద్దనే అట్టేపెట్టుకున్నారు. బాబే పవన్ మీద ఆయన పార్టీ మీద ప్రేమను వెళ్ళగక్కి బయటపడిపోయారు. ఆ విషయంలో బాబు కంటే నాలుగాకులు ఎక్కువే రాజకీయలలో చదివారు అనుకోవాలేమో.
Tags:    

Similar News