బీజేపీతో జనసేన పొత్తు... ఆదిలోనే హంసపాదు!

Update: 2020-02-05 13:22 GMT
తెలుగు నేల రాజకీయాల్లో ఓ నూతన అధ్యాయాన్ని లిఖిస్తానంటూ భారీ డైలాగులు వల్లించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్... జనసేన పేరిట పొలిటికల్ పార్టీని పెట్టి కాస్త సందడి అయితే బాగానే చేశారు. మొన్నటి ఎన్నికల్లో బొక్క బోర్లా పడిన తర్వాత... ఇప్పుడు తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ పొత్తు కొనసాగడం అంత వీజీ ఏమీ కాదన్న మాట వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ రెండు పార్టీలు పెట్టిన తర్వాత టేకప్ చేసిన తొలి విషయంలోనే ఇరు పార్టీల మధ్య విభేదాలు పొడచూపగా.. ఇప్పుడు అదే అంశం రెండు పార్టీల మధ్య మరింత అగాథాన్ని సృష్టించిందనే చెప్పాలి. మొత్తంగా బీజేపీతో కలిసి పవన్ ఇంకెన్నాళ్లో సాగరన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతి విషయంలో బీజేపీ ఓ స్టాండ్ తో ముందుకు సాగుతుంటే... దానికి భిన్నంగా సాగేందుకే పీకే నిర్ణయించుకున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తుకు ఆదిలోనే హంసపాదు ఎదురైందన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి.

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ దాదాపుగా అన్ని పార్టీలు వాదిస్తున్నాయి. అయితే మొన్నటి ఎన్నికల్లో అధికార పార్టీగా మారిన వైసీపీ కూడా అమరావతి నుంచి పూర్తిగా రాజధానిని తరలిస్తున్నామని చెప్పడం లేదు. అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ గా ఉంచేసి... విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, కర్నూలును జ్యుడిషియల్ కేపిటల్ గా ఏర్పాటు చేస్తామని... మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 50 రోజులుగా నాన్ స్టిప్ గా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో అసలు బీజేపీ స్టాండ్ ఏమిటన్న విషయంపై నిన్న పార్లమెంటె వేదికగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చేసిన కీలక ప్రకటన తేల్చేసింది. రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని కేంద్రం తేల్చేయడంతో అమరావతిలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు... బుధవారం కీలక ప్రకటన చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని తామూ కోరుకుంటున్నామని, అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజదానులను ఏర్పాటు చేస్తే... దానిని అడ్డుకునే అవకాశం కేంద్రానికి లేదని చెబుతూ... జగన్ వాదనకు పూర్తి మద్దతు ప్రకటించినట్టుగా మాట్లాడారు. జీవీఎల్ నుంచి ఈ ప్రకటన రాగానే... వెనువెంటనే రియాక్ట్ అయిన పవన్... మూడు రాజధానులకు బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇస్తే... తాను మాత్రం అమరావతి పరిరక్షణకే మద్దతిస్తానని సంచలన ప్రకటన చేశారు. బీజేపీతో తన పార్టీ పొత్తు పెట్టుకున్నదన్న విషయాన్ని కూడా పక్కనపెట్టేసిన పవన్... అమరావతి పరిరక్షణ కోసం తాను కూడా ప్రత్యక్ష ఉద్యమంలోకి దిగుతానని, ఈ నెల 10న తాను అమరావతి రైతుల వద్దకు వెళుతున్నానని కూడా ప్రకటించారు. అటు జీవీఎల్, ఇటు పీకే ప్రకటనలను బట్టి చూస్తే... బీజేపీ, జనసేనల మధ్య పొత్తు అంత వీజీ కాదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News