టిక్ టాక్ పై బ్యాన్.. మంచిదే తేల్చేసిన యూఎస్ సుప్రీంకోర్టు
దీనిపై జరిగిన విచారణలో.. టిక్ టాక్ బ్యాన్ చట్టాన్ని తీసుకొచ్చిన బైడెన్ సర్కారు నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు సైతం సమర్థించింది.
చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ను.. భద్రతా కారణాల నేపథ్యంలో అమెరికాలో నిషేధిస్తూ బైడెన్ సర్కారు ఒక చట్టాన్ని తీసుకురావటం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు అమెరికా సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. దీనిపై జరిగిన విచారణలో.. టిక్ టాక్ బ్యాన్ చట్టాన్ని తీసుకొచ్చిన బైడెన్ సర్కారు నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు సైతం సమర్థించింది.
చైనా మాతృ సంస్థ అయిన టిక్ టాక్ ను ఇతరులకు అమ్మని పక్షంలో నిషేధాన్ని అమల్లోకి తీసుకురావొచ్చని సుప్రీం తేల్చి చెప్పింది. అదే సమయంలో టిక్ టాక్ ను ఇతరులకు అమ్మిన పక్షంలో నిషేధం అవసరం లేదని పేర్కొంది. టిక్ టాక్ తో చైనాకు సంబంధాలు ఎప్పటిలా కొనసాగితే అమెరికా జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని.. అందుకే తాము అనుమతించలేమని సుప్రీం స్పష్టం చేసింది.
టిక్ టాక్ యాప్ ను అమెరికాలో 17 కోట్ల మంది అమెరికన్లు వినియోగిస్తున్నారు. టిక్ టాక్ పై బ్యాన్ విధిస్తూ బైడెన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టిక్ టాక్ పై బ్యాన్ విధించటం ద్వారా అమెరికాలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై.. సుప్రీం కీలక వ్యాఖ్య చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ కంటే కూడా దేశ భద్రతే ముఖ్యమని స్పష్టం చేసింది.
ఈ పరిస్థితుల్లో ఇప్పుడేం జరగనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. టిక్ టాక్ పై నిషేధాన్ని విధిస్తూ బైడెన్ సర్కారు చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో.. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. ఆ నిర్ణయాన్ని మరో 90 రోజులు నిలిపి వేసే అధికారం ఉంటుంది. మరోవైపు.. టిక్ టాక్ ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేసే అంశంపై తెర మీదకు రావటం తెలిసిందే. టిక్ టాక్ ను బ్యాన్ నిర్ణయాన్ని అమలు చేసే కన్నా.. తనకున్న విచక్షణాధికారంతో 90 రోజుల పాటు పొడిగిస్తూ.. ఆలోపు టిక్ టాక్ ను కొనుగోలు డీల్ క్లోజ్ అయ్యేలా పరిణామాలు ఉండే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.