జనసేనలో ఈ అంతరం..ఎప్పటికీ సమసిపోదబ్బా!

Update: 2020-01-16 14:30 GMT
నిజమే... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన పార్టీ జనసేనలో ఎప్పటికి కూడా ఏకాభిప్రాయం కుదిరే అవకాశమే కనిపించడం లేదన్న మాట ఇప్పుడు మరోమారు ఆసక్తికర చర్చకు తెర లేపిందని చెప్పక తప్పదు. క్షేత్ర స్థాయి అంశాల అవగాహనలో అంతగా పరిణతి కనిపించని పవన్ వైఖరి కారణంగా పార్టీ అధిష్ఠానానికి - క్షేత్రస్థాయి కార్యకర్తలుగా పిలుస్తున్న జన సైనికులకు అస్సలు పొంతన కుదరడం లేదు. ఇది ఇప్పటి సమస్య మాత్రమే కాదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఇదే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు - లేదంటే... బీజేపీలో తన పార్టీని విలీనం చేసే దిశగా పవన్ వేస్తున్న అడుగుల కారణంగా... పార్టీ శ్రేణులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోనున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదండోయ్... క్షేత్రస్థాయిలోని తమను పట్టించుకోకుండానే పవన్ తనదైన శైలి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం వైఖరితో తాము ఎలా ఏకీభవిస్తామన్న దిశగానూ జనసైనికులు ఆవేదనకు గురవుతున్నారు. మొత్తంగా పవన్ నడుస్తున్న దారిలో తాము నడవడం కుదిరే పని కాదన్న రీతిలోనే కొందరు జనసైనికులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

2014 ఎన్నికలకు కాస్తంత ముందుకు జనసేన పేరిట పవన్ పార్టీని స్థాపిస్తే.. ఆయనకున్న అశేష అభిమానులంతా ఆయన వెంటే నడిచేందుకు సిద్ధపడ్డారు. ఇక తన సొంత సామాజిక వర్గమైన కాపులు కూడా జనసేనకే మద్దతుగా నిలిచారు. అయితే అటు ఫ్యాన్స్ - ఇటు సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలకు షాకిస్తూ 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలోకి దిగేందుకే పవన్ ఇష్టపడలేదు. టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతిస్తూ పవన్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్స్ తో పాటు కాపులు కూడా తీవ్ర నిరాశ చెందారు. అయితే సంస్థాగత నిర్మాణం లేకుండా ఎన్నికలకు ఎలా వెళతామన్న పవన్ మాటను అయిష్టంగానే అంగీకరించిన జనసైనికులు... 2019 ఎన్నికలే లక్ష్యంగా సాగారు. అయితే ఎన్నికలకు కాస్తంత ముందుగా టీడీపీ - బీజేపీ మైత్రిని తెంచుకున్న పవన్... వామపక్షాలతో పొత్తు కుదుర్చుకున్నారు. దీంతో ఓ రేంజి జోష్ తో సాగిన జనసైనికులు పార్టీ విజయం కోసం తమదైన శైలిలో శ్రమించారు. అయితే తీరా ఎన్నికలు సమీపించే నాటికి పవన్ టీడీపీకి లోపాయికారి మద్దతు బయటపడిపోవడంతో జనసైనికులు ఖంగు తిన్నారు. సరే... ఇన్నేళ్లు ఎలాగూ టీడీపీతోనే సాగిన తాము... ఇప్పుడు కూడా టీడీపీతోనే సాగితే తప్పేంటన్న దిశగా ఆలోచించి మిన్నకుండిపోయారు.

తాజాగా పవన్ బీజేపీతో పొత్తుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సోమవారం జరగనున్న భేటీలో బీజేపీతో కలిసి సాగడమో, లేదంటే ఏకంగా జనసేనను బీజేపీలో విలీనం చేయడమో... పవన్ సంచలన నిర్ణయమైతే తీసుకుంటున్నారు. ఈ పరిణామంతో జనసైనికులంతా షాక్ తిన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నేళ్లు టీడీపీతో  సాగి... ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఏమాత్రం బలం - బలగం లేని బీజేపీతో కలిసి సాగేదెలా? అన్న దిశగా జనసైనికులు డోలాయమానంలో పడిపోయారు. ప్రత్యక్షంగా కలిసి ఉన్నా - లోపాయికారి మద్దతు కొనసాగినా... టీడీపీతోనే తమ బంధాలు బలోపేతమయ్యాయని - ఇప్పుడు కొత్తగా  బీజేపీతో కలిసి - టీడీపీకి వ్యతిరేకంగా సాగేదెలా? అన్న దిశగానూ జనసైనికుల్లో పెద్ద చర్చే నడుస్తోంది. అయినా ఏనాడైనా క్షేత్రస్థాయి పరిస్థితులను పవన్ ఆకళింపు చేసుకున్నారా? అంటూ తీవ్ర ఆవేదనలో కూరుకుపోయిన జనసైనికులు... తాము నడుస్తున్న దారిని పవన్ పట్టించుకున్న పాపానే పోలేదని ఒకింత తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్న వైనం నిజంగానే ఆసక్తికరమేనని చెప్పాలి. మొత్తంగా పార్టీ పెట్టిన నాటి నుంచి పవన్ ది ఓ దారి అయితే... జనసైనికులది మరోదారి అన్న మాట. ఇప్పుడు ఈ రెండు దారుల మధ్య మరింత దూరం పెరగడం మాత్రం ఖాయమనే చెప్పక తప్పదు.

 పార్టీలో కార్యకర్తలకు - పవన్ కల్యాణ్ కు మధ్య అభిప్రాయబేధాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యం. గత ఎన్నికల టైమ్ లోనే జనసేనానికి - జనసైనికులకు మధ్య ఉన్న ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే అదిప్పుడు బహిరంగం అయింది. క్యాడర్ అంతా ఒకవైపు మొగ్గుచూపుతుంటే - పవన్ కల్యాణ్ ఒక్కరు మరోవైపు అర్రులు చాస్తున్నారు. పవన్ ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత ఈ చీలిక మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

తెలిసో తెలియకో గతంలో టీడీపీకి మద్దతిచ్చారు పవన్ కల్యాణ్. చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు అతడిపై ఈగ వాలనివ్వలేదు. కేవలం ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాత్రమే బాబుతో విభేదించి సొంతంగా ఎన్నికలకు వెళ్లారు. అయితే చంద్రబాబుతో చేసిన సహచర్యం కారణంగా పవన్ ఈజీగానే యూ-టర్న్ తీసుకోగలిగారు కానీ జనసైనికులు మాత్రం అంత త్వరగా టర్న్ తీసుకోలేకపోయారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన ఒకటే. ఇలాంటి టైమ్ లో బీజేపీతో పొత్తుకు అర్రులు చాస్తున్నారు పవన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

సరిగ్గా ఇక్కడే జనసైనికులకు - పవన్ కల్యాణ్ కు మధ్య గ్యాప్ కనిపిస్తోంది. టీడీపీని కాదని క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్లలేమంటున్నారు జనసైనికులు. మొన్నటివరకు ఆర్థిక సహకారంతో పాటు లాజిస్టిక్ సపోర్ట్ కూడా టీడీపీనే ఇచ్చిందని - ఇప్పుడు వాళ్లను కాదని ఊళ్లలో తిరగలేమంటున్నారు. పైగా గ్రామస్థాయిలో బీజేపీ జీరో కాబట్టి - అస్సలు క్యాడర్ లేని అలాంటి పార్టీని మోయడం శుద్ధ దండగ అంటున్నారు.

పవన్ మాత్రం మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. ఎప్పట్లానే జనసైనికుల మాటల్ని ఆయన పెడచెవిన పెడుతున్నారు. బీజేపీతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. గతంలో టీడీపీ ఆర్థిక సాయం అందించినట్టు - ఈసారి బీజేపీ పవన్ కు ఆర్థిక సాయం అందిస్తుందన్నమాట. కానీ అన్నీ డబ్బుతో అవ్వవు - క్షేత్రస్థాయిలో జనం కావాలి. అది బీజేపీ వల్ల కాదు. జనసైనికుల బాధ ఇదే. దీన్ని పవన్ అర్థం చేసుకోవడం లేదు.

సార్వత్రిక ఎన్నికల్లో చేసిన తప్పునే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పవన్ రిపీట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు జనసైనికులు. మొన్నటివరకు నాయకులు మాత్రమే పార్టీని వీడారు. ఈసారి పవన్ తీసుకున్న నిర్ణయంతో జనసైనికులు కూడా పార్టీని వీడి పోయే పరిస్థితి తలెత్తింది


Tags:    

Similar News