జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే - రకరకాల కారణాలతో ఇప్పటికే ఈ టూర్ లో పవన్ ఎన్నో బ్రేకులు తీసుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతోన్న విషయం విదితమే. స్టార్ హీరో అయిన పవన్....తన సినిమా షూటింగ్ షెడ్యూల్ లాగే....ఈ పర్యటనను కూడా వాయిదా పద్ధతిలో విడతలు విడతలుగా నిర్వహిస్తున్నారని కొందరు ఎద్దేవా చేసిన సందర్భాలూ ఉన్నాయి. పవన్ పార్ట్ టైం పొలిటిషియన్ అని....తోచినపుడు యాత్రలు - పర్యటనలు చేస్తుంటారని కొందరు టీడీపీ నేతలు సెటైర్లు కూడా వేశారు. అయితే, తాజాగా విశాఖలోని రుషికొండ ప్రాంతంలో పర్యటించిన పవన్...ఒక్కసారిగా సినీహీరోగా మారిపోయి బైక్ రైడ్ చేశారు. రయ్ రయ్ మంటూ ఓ బైక్ పై చక్కర్లు కొట్టారు. అయితే, బైక్ నడుపుతున్నపడు బాధ్యత గల పౌరుడిగా హెల్మెట్ పెట్టుకోవాలన్న విషయాన్నిపవన్ మరిచారు. అందరికీ సుద్దులు చెప్పే పవన్....హెల్మెట్ లేకుండా బైక్ నడపడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రుషికొండలో ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ సంస్థ తరఫున కంపెనీని ఏర్పాటు చేసేందుకు ఇన్నోవా సొల్యూషన్స్ కు టీడీపీ ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించిన పవన్ ....ఇన్నోవా సొల్యూషన్స్ కు తక్కువ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ సర్కార్ పై మండిపడ్డారు. ఆ కంపెనీ ఏర్పాటుకు కొటేషన్ వేసిన ఉత్తరాంధ్ర సొల్యూషన్స్ కంపెనీలకు ఎకరా ధర రూ.3 కోట్లు చెప్పిన టీడీపీ సర్కార్.....తమకు అనుకూలమైన ఇన్నోవా సొల్యూషన్స్ కు 30 లక్షలకే ఎకరా ఎలా ధారాదత్తం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. 5 ఎకరాలు సరిపోయే చోట...15 ఎకరాలు మంజూరు చేయడం ఏమిటని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర భూములను - ఆస్తులను దోచుకుంటున్నారని...నిప్పులు చెరిగారు. ఇదే తరహా ధోరణిని చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తే....తెలంగాణ తరహాలో ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తుందని - దానికి పూర్తి బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదేనని పవన్ మండిపడ్డారు.