నేనేమీ ఎన్టీఆర్ మాదిరి అమాయకుడ్ని కాదు!

Update: 2018-08-14 05:47 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు క‌మ్ ఏపీ మంత్రి లోకేశ్ బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు జ‌న‌సేనాధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప్ర‌జా పోరాట యాత్ర పేరిట బ‌హిరంగ స‌భ‌ల్ని నిర్వ‌హిస్తున్న ఆయ‌న తాజాగా నిడ‌ద‌వోలు.. తాడేప‌ల్లిగూడెంల‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పెద్ద‌బాబు.. చిన‌బాబుల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

‘‘వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటు. లోకేశ్‌ కూడా వెన్నుపోటుతో సీఎం కావాలనుకుంటే కుదరదు. మీరు వెన్నుపోటు పొడుస్తుంటే పొడిపించుకునేందుకు నేను ఎన్టీఆర్‌ లా అమాయకుణ్ని కాదు. వెన్నుపోటు రాజకీయాలపై జనసైన్యం తిరగబడుతుంది’’ అని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో లోకేశ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. సీఎం కావాలంటే 60 ఏళ్లు ఆగాల‌న్నారు. ఎన్టీఆర్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో 60 ఏళ్లు క‌ష్ట‌ప‌డిన త‌ర్వాతే ముఖ్య‌మంత్రి అయ్యార‌ని.. తానూ చిత్ర‌ప‌రిశ్ర‌మ నుంచే వ‌చ్చాన‌న్నారు.

తాను ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నాన‌ని.. క‌ష్ట‌ప‌డి సీఎం అయిన ఎన్టీఆర్ ను చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నార‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు మద్దతిస్తే ప్రత్యేక హోదా సాధించలేకపోయారన్నారు. అధికారం చేపట్టి నాలుగేళ్లు అయినా నిడదవోలుకు ఒక్క ఆర్వోబీ నిర్మించలేకపోయారని త‌ప్పు ప‌ట్టారు.

తాను కోట్లాది రూపాయిలు సంపాదించే సినిమా రంగాన్ని వ‌దులుకుని రాజకీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. రాజ‌మండ్రి ఎంపీ క‌మ్ సినీ న‌టుడు ముర‌ళీమోహ‌న్ తో పాటు టీడీపీ నేత‌లంతా చేత‌కాని ద్ద‌ద‌మ్మ‌లుగా మండిప‌డ్డారు. వెన్నుపోటు రాజ‌కీయాలు చేయొద్దంటూ పెద్ద‌.. చిన్న బాబుల‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్‌.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని ఉండండి అంటూ లోకేశ్ ను హెచ్చ‌రించ‌టం గ‌మ‌నార్హం.

తునిలో రైలు త‌గ‌ల‌బెట్టిన సంఘ‌ట‌న‌లో అమాయ‌కుల‌పై చంద్ర‌బాబు కేసులు పెట్టార‌ని త‌ప్పు ప‌ట్టిన ప‌వ‌న్‌.. కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో త‌న వైఖ‌రిని స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తాను కానీ అధికారంలోకి వ‌స్తే త‌మిళ‌నాడు త‌ర‌హాలో బీసీల‌కు ఎలాంటి క‌ష్టం క‌ల‌గ‌కుండా కాపు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చే అంశంపై క‌స‌ర‌త్తు చేస్తాన‌ని చెప్పారు.  చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇచ్చే కిలో రూపాయి బియ్యాన్ని  ఎవ‌రూ తిన‌టం లేద‌ని.. కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశానికి రేష‌న్ బియ్యాన్ని త‌ర‌లించి టీడీపీ నేత‌లు కోట్లాది రూపాయిలు సంపాదిస్తున్నార‌ని ఆరోపించారు.

ప్ర‌జ‌లు తిన‌ని రేష‌న్ బియ్యం ద్వారా వేలాది కోట్ల దోపిడీ జ‌రుగుతుంద‌న్న ప‌వ‌న్‌.. ఈ దోపిడీకి చెక్ పెట్టేందుకు ఆడ‌ప‌డుచుల పేరుతో నిత్యావ‌స‌ర స‌రుకుల కోసం ప్ర‌తి నెలా రూ.2500 నుంచి రూ.3500 వ‌ర‌కు బ్యాంకు ఖాతాలో వేస్తామ‌న్నారు. మ‌హిళ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా గ్యాస్ సిలిండ‌ర్లు ఉచితంగా అందిస్తామ‌ని చెప్పారు.
Tags:    

Similar News