జీహెచ్ ఎంసీ బరిలో జనసేన..ఇరకాటంలో బీజేపీ!

Update: 2020-11-17 17:32 GMT
గ్రేటర్ ఎన్నికల నగారా మోగడంతో పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు క్యాండిడేట్ల వేటలో పడిపోయాయి. ఈ క్రమంలోనే బీజేపీకి షాకిస్తూ కబురును చల్లగా చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

మంగళవారం మంగళగిరిలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీకి క్రియాశీలక వర్కర్లున్న నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల అభీష్టం మేరకు జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపనున్నట్లు ఆయన వివరించారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రంలో.. జీహెచ్ఎంసీ పరిధిలో జనసేన పార్టీలో క్రియాశీలకంగా చాలా మంది ఉన్నారని.. కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి పోటీ చేయాలని పలు విజ్ఞప్తులు వచ్చాయని’ పవన్ కళ్యాణ్ తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటికి సన్నద్ధం కావాలని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, కమిటీల ప్రతినిధులకు సూచించారు.

జీహెచ్ఎంసీలో పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయని.. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయని పవన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీచేయాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్తులను నిలుపుతుందని పవన్ ప్రకటించారు.

అయితే ఏపీలో బీజేపీతో పొత్తున్న జనసేన తెలంగాణకు వచ్చేసరికి పొత్తును కొనసాగిస్తుందా? ఒంటరిగా పోటీచేస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని పోటీచేస్తాయా? అన్నది కూడా చూడాలి. అయితే మూడురోజులే టైం ఉండడంతో ఈ చర్చలు, పొత్తులు తేలే అవకాశం లేదు. పైగా జనసేనతో కలిస్తే టీఆర్ఎస్ టార్గెట్ చేసి ఆంధ్ర ముద్ర వేస్తే బీజేపీ మొదటికే మోసం వస్తుంది. ఈ విషయంలో జనసేన -బీజేపీ ఎలా ముందుకెళుతాయన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News