య‌న‌మ‌ల‌కు పంచ్ వేసిన ప‌వ‌న్‌

Update: 2015-08-20 10:34 GMT
క‌దిలించి దొబ్బులు పెట్టించుకోవ‌టం తెలుగు త‌మ్ముళ్ల‌కు మించి మ‌రొక‌రికి సాధ్యం కాదేమో. ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వ్య‌క్తి చేసిన సూచ‌న‌ పై ఎలా స్పందించాలన్న అంశంపై వ్యూహం లేకుండా.. నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడిన తెలుగుదేశం నేత‌ల‌కు ప‌వ‌న్ ట్విట్ట‌ర్ సాక్షిగా పంచ్ వేశారు. ఏపీ రాజ‌ధాని కోసం అవ‌స‌ర‌మైన భూమ‌ల్ని ఇచ్చేందుకు సిద్ధంగా లేని రైతుల విష‌యంలో ప్ర‌భుత్వం స‌హృద‌యంతో ఆలోచించాల‌ని.. బ‌ల‌వంతంగా భూసేక‌ర‌ణ చేయొద్ద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లుమార్లు ట్వీట్స్ ద్వారా సూచ‌న‌లు చేయ‌టం తెలిసిందే.

ప‌వ‌న్ కల్యాణ్ లాంటి వ్య‌క్తి ఒక విష‌యంపై వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు.. ఆచితూచి స్పందించాల్సిన స్థానే.. విప‌క్షాల‌పై ఎట‌కారంగా.. వంక‌ర‌గా మాట్లాడే మంత్రి య‌న‌మ‌ల.. అదే సూత్రాన్ని ప‌వ‌న్ పై ప్ర‌యోగించ‌టం తెలిసిందే. భూసేక‌ర‌ణ వ‌ద్దంటున్న ప‌వ‌న్‌.. భూమిని ఏ ర‌కంగా సేక‌రించాలో కూడా చెప్పాలంటూ య‌న‌మ‌ల వ్యాఖ్య చేయ‌టం తెలిసిందే.

అవ‌స‌రానికి మించి య‌న‌మ‌ల స్పందించార‌న్న వాద‌న వినిపించిన దానికి త‌గ్గ‌ట్లే తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ ద్వారా పంచ్ లు వేసేశారు. ముందు క‌ట్టేది స్వ‌ర్గం అని తెలిస్తే.. అతి త్రిశంక స్వ‌ర్గ‌మా.. రెగ్యుల‌ర్ స్వ‌ర్గ‌మా అనేది త‌ర్వాత ఆలోచించొచ్చ‌న్న ప‌వ‌న్‌.. సినిమా ప‌రిశ్ర‌మ‌కి హైద‌రాబాద్‌ లో ఇచ్చిన‌వి కొండ‌ల‌ని.. బ‌హుళ పంట‌లు పండే పొలాలు కాద‌ని వ్యాఖ్యానించారు.

ఈ విష‌యాలు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకి తెలియ‌ద‌నుకుంట అన్న ఆయ‌న‌.. త‌న‌కైతే హైద‌రాబాద్ కొండ‌ల్లో కానీ.. విశాఖ‌ప‌ట్నం కొండ‌ల్లో కానీ స్టూడియోలు లేవ‌ని ట్వీట్ చేశారు.

తానెంతో బాధ్య‌త‌తో రైతుల స‌మ‌స్య‌ని ప్ర‌భుత్వం ముందుకు తీసుకెళితే.. విజ్ఞతతో స్పందిచడం మానేసి రైతుల ఆవేదనని వెటకారం చెయ్యడం య‌న‌మ‌ల‌కే చెల్లింద‌న్నారు. తాను త్వ‌ర‌లోనే బేత‌పూడి.. ఉండ‌వ‌ల్లి.. పెనుమాక త‌దిత‌ర న‌దీ ప‌రివాహ‌క గ్రామాల రైతుల్ని క‌లుస్తానంటూ త‌న భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ను కూడా వెల్ల‌డించేశారు. సూచ‌న చేసిన‌ప్పుడు దాని లోతుపాతులు తెలుసుకోకుండా.. అధికారం చేతిలో ఉంది క‌దా అని మాట్లాడితే.. ఫ‌లితం ఇలానే ఉంటుంది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై తొంద‌ర‌ప‌డి ఎవ‌రూ స్పందించొద్ద‌ని చంద్ర‌బాబు ఎందుకు చెప్ప‌టం లేదు..?
Tags:    

Similar News