స‌చివాల‌యం క‌ట్ట‌లేని వారు...పోల‌వ‌రం క‌డ‌తారా?

Update: 2017-12-07 08:28 GMT
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన  జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలున్నాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయకపోతే లెక్కలు ఎందుకు చెప్పదని ప‌వన్‌ కల్యాణ్‌  ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ప‌వ‌న్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిజాలు దాస్తున్న కొద్ది సందేహాలు కలుగుతున్నాయని ప‌వన్ కామెంట్ చేశారు.

జనసేన అధ్యక్షుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న అనంత‌రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను అక్కడి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం పవన్‌ కల్యాణ్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పవన్‌ పరిశీలించారు. స్పిల్‌ వే - డయా ఫ్రం వాల్‌ - దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులను పవన్‌ కల్యాణ్ తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల గురించి అధికారులు పవన్‌కు వివరించారు. మ్యాప్‌ ద్వారా ప్రాజెక్టు సాంకేతిక అంశాలను సైతం అధికారులు విశ‌దీక‌రించారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్  హిల్‌ వ్యూ నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను పవన్‌ పరిశీలించారు.

ప్రాజెక్టు వ‌ద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ...పోలవరం ప్రాజెక్టుపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చానన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానిదో.. ఏ ఒక్క పార్టీదో కాదన్నారు. పోలవరం చాలా కష్టమైన - ఛాలెంజింగ్‌ ప్రాజెక్టు అన్నారు. ప్రాజెక్టుతో లాభమెంత.. నష్టమెంత అనేది పరిశీలించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు రూ.125 కోట్లతో ప్రారంభమైందన్నారు.అయితే అనంత‌రం పెద్ద ఎత్తున వ్య‌యం పెరిగిపోయింద‌న్నారు.  పోలవరం విషయంలో తాను ఎవరినీ నిందించడం లేదని ప‌వ‌న్ తెలిపారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులో అవకతవకలు సర్వసాధారణమని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. పోలవరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అప్పటికి కూడా కేంద్రం స్పందించకపోతే తాను కూడా క‌లిసి పోరాటం చేస్తానన్నారు. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలని, తప్పులు జరుగుతాయని, రాజకీయాలు చేయడం సరికాదన్నారు.

‘పోలవరం ప్రాజెక్టు కడతామని మీరే తీసుకున్నారు. ఇప్పుడు వద్దని వెనక్కి ఇచ్చేస్తే అనుమానాలు కలుగుతాయి. కేంద్రంతో ధైర్యంగా మాట్లాడి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. మీరు అవకతవకలకు పాల్పడనట్లయితే ఎందుకు భయపడుతున్నారు.?` అని జనసేన పార్టీ అధినేత పవన్‌ ప‌వ‌న్ ఏపీ సీఎం చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించారు. 2018 సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు పూర్తికావడం అసాధ్యమేనని కల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సెక్రటేరియేట్‌ కట్టలేనివాళ్లు పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు? అని సూటిగా ప్రశ్నించారు. ప్రాజెక్టుపై సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అనంత‌రం రాజమండ్రి బయల్దేరి వెళ్లారు.
Tags:    

Similar News