పవన్ చేతికి పవర్ వచ్చేదెప్పుడో భలేగా చెప్పారుగా?

Update: 2019-07-31 05:14 GMT
చేతికి వచ్చే పవర్ గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా మాటల్నే చెబుతుంటారు. కాకపోతే.. ఆయన సమస్య ఏమంటే.. ఒకసారి చెప్పిన మాటను మరోసారి చెప్పకపోవటం. చెప్పిన మాటను మర్చిపోవటం. రాజకీయాల్లో రాణించాలంటే ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఉండటంతో పాటు.. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం చాలా అవసరం. అప్పుడప్పుడు పవన్ మాట్లాడే మాటలు పవర్ ఫుల్ గా ఉంటాయే తప్పించి.. చేతల్లో ఆ పవర్ కనిపించదు.

రాజకీయాల్లోకి వచ్చినంతనే పవర్ చేతికి వచ్చేయాలన్న ఆశ తనకు లేదని చెప్పే పవన్.. గత ఎన్నికల సమయంలో టీడీపీతో చేసుకున్న అంతర్గత ఒప్పందాల మీద చాలానే విమర్శలు ఉన్నాయి. లోగుట్టుగా టీడీపీతో తమకు ఎలాంటి లెక్కలు లేవని చెప్పే ఆయన.. మంగళగిరిలోనూ.. కుప్పంలోనూ ఎందుకు ప్రచారం చేయలేదన్న ప్రశ్నకు ఈ రోజు వరకూ పవన్ సమాధానం చెప్పలేదు.

అదే సమయంలో.. పవన్ పోటీ చేసిన భీమవరం.. గాజువాకలలో చంద్రబాబు ఎందుకు ప్రచారం చేయలేదన్న విషయానికి జవాబు చెప్పింది లేదు. బయటకు కనిపించకుండా ఉండే బంధాల్ని ప్రజలు గమనించలేరన్నట్లుగా పవన్ తీరు ఉంటుంది. కానీ.. విషయాల్ని సునిశితంగా ప్రజలు చూస్తుంటారన్న విషయాన్ని జనసేనాని మిస్ అవుతుంటారన్న భావన కలుగకమానదు.

జనంలోకి వెళ్లేందుకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పే పవన్ కల్యాణ్.. గతంలో చిన్న చిన్న పాదయాత్రలు చేస్తానని చెప్పి.. ఇప్పటివరకూ ఎందుకు చేయలేదో అర్థం కాదు. ఎక్కడిదాకానో ఎందుకు అనంతపురం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తానని చెప్పే పవన్..  ఈ రోజు వరకూ ఆ పని చేసింది లేదు. ఎందుకన్న విషయం మీద ఆయన కానీ.. పవన్ సన్నిహితులు కానీ నోరు విప్పే ధైర్యం చేయరు?

ఇక.. తన చేతికి అధికారం వచ్చే తీరు గురించి పవన్ మాటలు చూస్తే.. కొన్నేళ్ల క్రితం పార్టీ పెట్టిన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ చప్పున గుర్తుకు రాక మానరు. పార్టీ పెట్టినంతనే రాష్ట్రస్థాయిలో పవర్ లోకి ఎప్పుడు వచ్చేదో చెప్పిన ఆయన.. జాతీయ స్థాయిలో అధికారాన్ని సొంతం చేసుకునే సంవత్సరాన్ని చెప్పేసి ఆశ్చర్యపోయేలా చేశారు. జాతీయ రాజకీయాలు లాంటివి పక్కన పెడదాం.. కాసేపు ఏపీలో ఎలా అధికారంలో వస్తారో.. మీ దగ్గర ఏమైనా అనాలసిస్ ఉందా? అన్న ప్రశ్నకు జేపీ పొంతన లేని సమాధానాలు చెబుతుండేవారు. తాజాగా పవన్ మాటలు అదే రీతిలో ఉండటం గమనార్హం.

రాజకీయాలు వ్యాపార ధోరణిలోకి వెళ్లిన పరిస్థితుల్లో ఆశయాలు సాధించే వ్యక్తులు కావాలని ప్రజలు వెతికే రోజు వస్తుందని.. ఆ సమయం కోసమే తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా అవకాశాల్ని అందుకునేందుకు ప్రయత్నిస్తారు. అందుకు భిన్నంగా అవకాశం తనను వెతుక్కునే వేళ వరకూ వెయిట్ చేస్తానంటూ పవన్ చెప్పే మాటలు చూస్తే.. జేపీ కలలు కన్నట్లే పవన్ కూడా రాజ్యాధికారం కోసం డ్రీమ్స్ లో ఉన్నారా? అన్న సందేహం కలుగక మానదు. రెండు ఎన్నికల్ని చూసిన తర్వాత కూడా పవన్ ఇలానే మాట్లాడటం ఏమిటో?
Tags:    

Similar News