పవన్ అభిమాని హత్య

Update: 2016-08-23 10:58 GMT
తెలుగు హీరోలపై జనానికి ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు.. ఒక్కోసారి ఆ అభిమానం హద్దులు దాటి ఘర్షణలకు దారితీస్తుండడమే ఇబ్బందికరంగా మారుతోంది. రెండు రోజుల కిందట కర్ణాటకలో పవన్ కళ్యాణ్ - జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో పవన్ అభిమాని ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రెండు రోజుల తరువాత వెలుగు చూసింది.

తిరుపతికి చెందిన వినోద్ రాయల్ అనే పవన్ అభిమాని జనసేన తరఫున నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. ఆదివారం కర్ణాటకలో జనసేన తరఫున నిర్వహించిన అవయవదాన కార్యక్రమంలో వినోద్ పాల్గొన్నాడు. ఆ తరువాత వినోద్, మరికొందరు మద్యం సేవించారు. మద్యం తాగిన తరువాత వారి మధ్య హీరోల్లో ఎవరు గొప్ప అన్న చర్చ జరిగింది. మా హీరో గొప్పవాడంటే మా హీరో గొప్పవాడంటూ వారంతా ఘర్షణ పడ్డారు. గొడవ ముదిరి ఎన్టీఆర్ అభిమాని ఒకరు కత్తితో వినోద్ ను పొడిచాడు.

దీంతో వినోద్ ను ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే, ఇందులో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వినోద్ ఆ కార్యక్రమానికి వచ్చి ఇతర హీరోల అభిమానులతో కలిసి మద్యం సేవించడం ఎలా సాధ్యమైందని.. ఒకవేళ వారు కూడా పవన్ సేవా కార్యక్రమానికే వచ్చారా.. అంతగా వ్యతిరేకత ఉన్నప్పుడు ఎలా వచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు వేరే కారణాలేమైనా ఉండొచ్చన్న అనుమానాలను పోలీసులు వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News