పవన్ కోరుతున్నది అదా? ఇదా?

Update: 2018-02-10 10:55 GMT
ఇంతకూ పవన్ కల్యాణ్ చేయదలచుకుంటున్న పోరాటం ఎందుకోసం? ఈ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంటున్నది. పవన్ కల్యాణ్ నిన్నటి వరకు ప్రత్యేకహోదా సాధించడం తన లక్ష్యం కింద మాట్లాడారు. ప్రత్యేకహోదాకు ప్రత్యమ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పది అంటూ చంద్రబాబు నాయుడు తనకు చెప్పారని.. తర్వాత అవన్నీ అబద్ధాలని తేలిందని కూడా రెండు రోజుల కిందటే చెప్పారు. మేధావులందరినీ కలుపుకుని హోదా సాధించాలని ఉన్నదని అన్నారు.

తీరా శుక్రవారం నాడు ట్వీట్ లో విభజన హామీలకు సంబంధించి ఒక భిన్నమైన ప్రకటన చేశారు. విభజన హామీలకు సంబంధించి సంయుక్త నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అంటున్నారు. ఇంతకూ పవన్ తాను పోరాడదలచుకుంటున్న మార్గం అదా? ఇదా? అనే స్పష్టత ప్రజలకు కొరవడుతోంది.

ప్రత్యేకహోదా అయితే మాత్రం ఏముంది? విభజన హామీలు అంటే మాత్రం ఏముంది? రెండూ ఒకటే కదా..? అని ఎవరైనా వాదించవచ్చు. కానీ ఈ రెండింటికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. విభజన హామీలు అనేవి ఇవా కాకపోతే రేపైనా మనకు వచ్చే అవకాశం ఉంది. వాటికోసం ఎలాగూ తెదేపా - వైకాపా - కాంగ్రెస్ పార్టీలన్నీ పార్లమెంటును ఉక్కిరిబిక్కిరి చేసి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి.

అయితే ప్రత్యేకహోదా సంగతి వేరు. ఆ విషయంలో ఆల్రెడీ మనకు అన్యాయం జరిగిపోయింది. హోదాను అటు భాజపా ఇటు తెదేపా కలిసి తుంగలో తొక్కేశాయి. మనకు మాత్రం ఆర్థిక సంఘం - జీఎస్టీ అనే కల్లబొల్లి కబుర్లు చెప్పి.. హోదా ఇవ్వలేం అని నయగారంగా నమ్మించి - ప్యాకేజీ అనే ఒక బ్రహ్మపదార్థాన్ని మన చేతిలో పెట్టారు. అదేమిటో అర్థంచేసుకోవడానికి ఇప్పటిదాకా ఎవ్వరికీ వల్ల కావడం లేదు.

కాబట్టి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం అనేది ప్రస్తుతానికి తక్షణావసరం. ఇంతకూ పవన్ కల్యాణ్ హోదా గురించే పోరాడదలచుకుంటున్నారా? విభజన హామీలు అనే గంపగుత్త అంశాన్ని టేకప్ చేసి మందలో పడి తానూ ఒకడిగా గోవింద కొట్టాలనుకుంటున్నాడా అనేది అర్థం కావడం లేదు. విభజన హామీలు అనే పదం నెత్తికెత్తుకుంటే గనుక.. ఆయన పోరాటం గురించి ఆశలు పెట్టుకోవడం దండగ  అని పలువురు భావిస్తున్నారు.

Tags:    

Similar News