ముద్రగడకు కౌంటర్ ఇవ్వద్దు : పవన్ హుకుం

Update: 2017-08-03 04:16 GMT
ఉద్ధానం బాధితులకు సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశం కావడం - ఆయనతో సుదీర్ఘంగా రాష్ట్రంలోని అన్ని రకాల పరిస్థితుల గురించి చర్చించడం, ఆ తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరు అందరూ గమనించారు. అయితే ఆ తరువాత.. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. కనీసం ట్వీట్ల ద్వారా కూడా ముద్రగడ పద్మనాభం లేఖకు ఎలాంటి కౌంటర్ స్టేట్ మెంట్లు ఇవ్వద్దని, మౌనం పాటిస్తే సరిపోతుందని పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ కోటరీకి పురమాయిచింనట్లుగా తెలుస్తోంది.

ముద్రగడ పవన్ కల్యాణ్ కు రాసిన లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబునాయుడు మాయలో పడవద్దంటూ పవన్ కు హితబోధ కూడా చేశారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత.. పవన్ కల్యాణ్ తన ప్రెస్ మీట్ లో ఇండైరక్టుగా ముద్రగడ పాదయాత్రను ఉద్దేశించి.. రెచ్చగొట్టేలాగా కుల ఉద్యమాలు జరగడం సరికాదంటూ ఒక సూచన కూడా చేశారు. అలాగే ప్రజల సమస్యలను పరిష్కరించాలంటే.. ఆ ఉద్దేశం మనసులో ఉంటే సరిపోతుందని, పాదయాత్రలు చేయాల్సిన అవసరం లేదని కూడా పవన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు జగన్ పాదయాత్ర గురించిన ప్రశ్న సందర్భంలో సమాధానంగా వచ్చినప్పటికీ, ఇండైరక్టుగా ముద్రగడ పాదయాత్ర లక్ష్యానికి కూడా తగిలేవే. ఆ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇస్తూ.. సలహాల రూపంలో ముద్రగడ పద్మనాభం సుదీర్ఘమైన లేఖ రాశారు.

దీనికి సంబంధించి పవన్ కోటరీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఈ ముద్రగడ లేఖ వల్ల ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో తమ మీద దురభిప్రాయం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అయినప్పటికీ.. ఆ లేఖకు కౌంటర్ ఇవ్వడానికి పవన్ కల్యాణ్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. కనీసం ట్వీట్ ద్వారా అయినా కౌంటర్ ఇద్దామనే సూచన వచ్చినప్పటికీ.. ట్వీట్ కూడా వద్దని.. ఈ విషయంలో మనం మౌనం పాటిస్తే సరిపోతుందని అభిమానులు అర్థం చేసుకోగలరని పవన్ చెప్పినట్లుగా, ఈ ఎపిసోడ్ ను ఇంతటితో ముగించాలని కూడా భావించినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News