బాబు సర్కారుకు పవన్ రక్షకుడా..?

Update: 2015-11-17 22:30 GMT
రాజకీయాల్లో నమ్మకస్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇక.. అత్యున్నత స్థానంలో ఉన్న వారికి సంబంధించి నిత్యం వారిని కలుసుకునేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు. అలాంటి వారిలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? ఎవరిపట్ల విశ్వాసంగా ఉండాలన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇక.. అధికారానికి దూరంగా ఉన్న సమయంలో పలు సందర్భాల్లో అండగా నిలిచిన వారికి ఏదో ఒక సాయం చేయాల్సి రావటం.. అలా చేసిన సమయంలో.. వచ్చే ఉపద్రవాల విషయంలో ఏ మాత్రం అంచనా తప్పినా ప్రభుత్వానికి జరిగే నష్టం భారీగా ఉంటుంది. అయితే.. ఇలాంటి నష్టం జరగకుండా చూసుకునే రక్షకుడు ఒకరు అవసరం. నిజానికి అలాంటి అవకాశం చాలామంది రాజకీయ నాయకులకు లభించదు.

రాష్ట్ర విభజనతో పుట్టెడు సమస్యలతో రాజ్య భారాన్ని మోస్తున్న చంద్రబాబుకు కొన్ని సానుకూలతలు వరంగా మారాయని చెప్పాలి. అనుభవం లేని ప్రతిపక్ష నేత కారణంగా చంద్రబాబు ఒక వెసులుబాటు లభిస్తే.. మిత్రుడిగా ఉన్న పవన్ కల్యాణ్ మరో బలంగా మారినట్లుగా కనిపిస్తుంది. ఇవాల్టి.. రేపటి రోజున తన కారణంగా ఎవరైనా ప్రయోజనం పొందితే.. అందుకు పది రెట్లు బదులు ఇవ్వాలని కోరుకునే కాలంలో.. అందుకు భిన్నంగా ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఉండే మిత్రుడు దొరకటం సాధ్యం కాదు. కానీ.. అదృష్టవశాత్తు చంద్రబాబుకు.. పవన్ కల్యాణ్ రూపంలో మంచి రాజకీయ మిత్రుడు లభించాడనే చెప్పాలి. తనకు తానుగా స్పందించి బయటకు వచ్చిన రెండు అంశాలు చూస్తే.. చంద్రబాబుకు పవన్ ఎంతటి వరమో ఇట్టే అర్థమవుతుంది.

దేశంలోమరెక్కడా లేని విధంగా ఏపీ రాజధాని కోసం 33వేల ఎకరాల్ని సమీకరించి.. ఏపీ ముఖ్యమంత్రి తన సత్తా చాటారు. తనకున్న విశేష పరిపాలనా సామర్థ్యం ఏమిటో ఏపీ రాజధానికి అవసరమైన భూమిని సేకరించటం ద్వారా తన సత్తా చాటారు. అయితే.. భూసమీకరణ విషయంలో ఒక పట్టాన కొరుకుడుపడని.. కొందరు రైతుల విషయంలో దండ ప్రయోగం చేయాలని భావించి... వారిపై భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలని బాబు నిర్ణయించారు. ఈ విషయంపై తనకున్న అసంతృప్తిని ట్విట్టర్ లో ట్వీట్ల ద్వారా నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం చేశారు పవన్.
అయితే..  పవన్ సందేశాన్ని అర్థం చేసుకునే విషయంలో ఏపీ మంత్రులు.. తెలుగు తమ్ముళ్లు ప్రదర్శించిన అతితెలివి.. వాతావరణం వేడెక్కిపోయేలా చేసింది. దీంతో.. పవన్ తనకు తానుగా బయటకు వచ్చి రాజధాని కోసం భూములు సేకరిస్తున్న ప్రాంతాల్లో పర్యటించటం.. భూసేకరణను వ్యతిరేకించే రైతుల సమూహాల్ని కలిసి.. వారి వాదనను రాష్ట్ర ప్రజలకు.. ఏపీ ముఖ్యమంత్రికి తెలియజేసే ప్రయత్నం చేశారు. తమకు సరైన ప్యాకేజీ ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందన్న విషయంతో పాటు.. మరికొన్ని సాంకేతిక కారణాల్ని తెరపైకి తీసుకొచ్చి.. కొద్దిపాటి భూమి (33వేల ఎకరాలతో పోల్చినప్పుడు) విషయంలో ఏపీ సర్కారు రచ్చ చేసుకోవటం మంచిదా? అన్న ప్రశ్న తమకు తాము వేసుకునేలా చేయగలిగారు పవన్.

అదే సమయంలో.. తన వ్యక్తిగత మాటను కూడా చెప్పేసి.. భూసేకరణ విషయంలో ఏపీ సర్కారు అడుగు ముందుకు వేయకుండా అడ్డుకొని.. ప్రభుత్వం బద్నాం కాకుండా చేయటమే కాకుండా.. భూసేకరణ విషయంలో విపక్షాలు ఎలాంటి లబ్ది చేకూరకుండా పవన్ అడ్డుకున్నారని చెప్పాలి.

తాజాగా బాక్సైట్ వ్యవహారమే చూస్తే.. పవన్ మరింత పరిణితి కలిగిన నాయకుడిగా వ్యవహరించారు. భూసేకరణను వ్యతిరేకించే విషయంలో ట్వీట్ల రూపంలో కాస్త హడావుడి చేసిన పవన్.. బాక్సైట్ విషయంలో మాత్రం గుంభనంగా ఉన్నారు. విషయాన్ని నర్మగర్భంగా చెప్పటం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని గుర్తించిన పవన్.. ఈసారి తన మనసులోని మాటను ఏపీ ముఖ్యమంత్రికే నేరుగా చెప్పేసి.. ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని వివరించినట్లుగా చెబుతున్నారు. పవన్ మాటల్లోని నిజాన్ని గుర్తించిన బాబు వెంటనే.. నష్టనివారణ చర్యలు చేపట్టారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నిజానికి బాక్సైట్ విషయంలో ప్రభుత్వం యుద్ధం ప్రకటించేందుకు విపక్షాలు కత్తులు నూరుతున్న సమయంలోనే.. వారికి అలాంటి అవకాశం ఇవ్వకుండా పవన్ మరోసారి అడ్డుకున్నారని చెప్పాలి. ఏపీ సర్కారు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే రెండు ముఖ్య సందర్భాల్లోనూ పవన్ ఎంట్రీ ఇవ్వటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఏపీ సర్కారుకు రక్షకుడిగా పవన్ అవతరించారని చెప్పొచ్చు.
Tags:    

Similar News