జ‌న‌సేన‌కు మూడేళ్లు...వాట్ నెక్ట్స్‌?

Update: 2017-03-14 03:45 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆధ్వ‌ర్యంలో రాజ‌కీయ ముఖ‌చిత్రంపై మెరిసిన పార్టీ జ‌న‌సేన‌. జ‌న‌సేన రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించి నేటికి మూడేళ్లు. స్వ‌ల్ప‌కాలంలోనే జ‌న‌సేన త‌న ముద్ర‌ను చాటుకుంది. ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌న గ‌ళం వినిపించ‌డంతో పాటు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనా జ‌న‌సేన వేదిక‌గా ప‌వ‌న్ కార్య‌క్షేత్రంలోకి దిగారు. ఉద్దానం కిడ్నీ బాధితులు - అమ‌రావ‌తి కోసం భూములు ఇచ్చిన రైతులు - చేనేత కార్మికులు ఇలా విభాగం ఏదైనా ఈ మూడేళ్ల‌లో ప‌వ‌న్ క్రియాశీల‌క పాత్ర పోషించార‌నేది కాద‌న‌లేని నిజం. అయితే రాష్ట్రంలో ప్ర‌స్తుతం 2019 ఎన్నిక‌ల మూడ్ ఇటు అధికార ప‌క్షం - అటు ప్ర‌తిపక్షాల్లోనూ వ‌చ్చేసినందున ప‌వ‌న్ ఏం చేయ‌నున్నార‌నే ఆస‌క్తి క‌లుగుతోంది.

గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికలకు ఇక రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో జనసేనను ప్రజల్లోకి తీసుకుకెళ్లే వ్యూహంతో ముందుకు సాగుతున్నార‌ని స‌మాచారం. ప్రజా సమస్యలపై స్పందించడం ద్వారా తాము విపక్ష పాత్ర పోషిస్తున్నామన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే శ్రీకాకుళం ఉద్దానంలో కిడ్నీ బాధితుల పరామర్శ - వారికి భరోసా ఇవ్వడం ద్వారా మంచి మైలేజ్ సాధించారు.  ఇదే ఊపుతో ప్రజా సమస్యలపై జనసేన స్పందించనుందని అంటున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న జనసేన హోదా సాధనతో పాటు ప్రాంతాల వారీగా స్థానిక సమస్యలపై స్పందించడం ద్వారా నేరుగా జనాల్లోకి వెళ్లాలన్న యోచన చేస్తోంది. అలాగే ప్రాంతాల వారీగా ఆయా సమస్యలపై అధినేత పవన్ నేరుగా ఉద్యమంలోకి దిగడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తే - ఇక మనకు తిరుగు ఉండదని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.

రాజకీయ పార్టీగా అవతరించి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మ‌రింత‌గా జనంలోకి వెళ్లాలన్న అభిప్రాయంతో అధినేత పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారని అంటున్నారు. దీనిలో భాగంగానే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు రావాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించి ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసుకునేందుకు జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పోర్టల్‌ ను ప్రారంభించనున్నట్టు సమాచారం. ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోర్టల్‌ ను లాంఛనంగా ప్రారంభించే అవకాశాలున్నట్టు అంతరంగికులు పేర్కొంటున్నారు. ‘జనగళం’ పేరిట ఏర్పాటు చేసే పోర్టల్‌ లో ఆయా ప్రాంతాలకు చెందిన సమస్యలు ప్రస్తావిస్తే దానిపై జన‘సేన’ స్పందించే విధంగా తీర్చిదిద్దనున్నారు. జ‌నగళం ద్వారా తొలి ప్రయత్నంగా నేడు(14వ తేదీ) ఆయా జిల్లాల్లో స్థానిక అవసరాలు - సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేలా కార్యక్రమాన్ని చేపట్టనుంది. తద్వారా ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి, భవిష్యత్‌ లో తాము రాజకీయంగా తెరపైకి రావడమే కాకుండా, బలమైన ప్రత్యర్థిగా నిలుస్తామన్న సంకేతాలివ్వనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News