జనసేన అధినేత - సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (జె.ఎఫ్.సి) కమిటీని వేగంగా ముందుకు తీసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కల్పించిన హామీల అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం - ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనల వల్ల ప్రజలలో గందరగోళం ఏర్పడడంతో వాస్తవాలను దృవీకరించడానికి జేఎఫ్ సీని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వేదికను పవన్ వేగంగా ముందుకు తీసుకుపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ లోని 16 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ఈ కమిటీ సమావేశం 17 వ తేదీన కూడా కొనసాగుతుంది. ఈ సమావేశానికి ప్రముఖ రాజకీయవేత్తలు - న్యాయకోవిదులు - ఆర్ధిక శాస్త్రవేత్తలు - విద్యావేత్తలు - సామాజిక నిపుణులతో పాటు అనేక ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ - లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ - సీనియర్ పార్లమెంటేరియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ - లోక్ సభ మాజీ సభ్యులు కొణతాల రామకృష్ణ - సీపీఎం.ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మధు - సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ - కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనమండలి మాజీ సభ్యులు గిడుగు రుద్రరాజు - పీసీసీ కార్యదర్శి జంగా గౌతమ్ - పూర్వపు శాసనమండలిలో సభ్యులైన ప్రొఫెసర్ నాగేశ్వర రావు - ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలాఉండగా... 16వ తేదీ ఉదయం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి శ్రీ పవన్ కళ్యాణ్ పూలమాల వేసి - అంజలి ఘటించిన అనంతరం జేఎఫ్ సీ సమావేశంలో పాల్గొనడానికి వెళతారని పార్టీ తెలిపింది.