రాజ‌ధాని రైతుల‌కు మ‌ద్ద‌తుగా పవ‌న్ లేఖాస్త్రం

Update: 2020-01-07 12:54 GMT
ఏపీ రాజ‌ధాని అమరావతి ప్రాంత రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు చేయడమే కాకుండా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. "రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్దతిలో శాంతి యుతంగా నిరసన తెలిచేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. ఈ రోజు చినకాకాని దగ్గర రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్ధనీయం కాదు.

రైతులను మహిళలను భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చెయ్యాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ రోజు నిరసన మొదలుకాక ముందే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ గారిని గృహ నిర్భందంలో ఉంచారు. పార్టీ కార్యదర్శి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్‌ ను కారణం చెప్పకుండానే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. ఇలాంటి చర్యలతో ఆందోళనలను ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటే అవుతుంది. అమరావతి నుంచి రాజధానిని తరలించి భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేస్తున్నారు.

విశాఖపట్నం వాసులకు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనుకబాటుతనం ఉంది. అక్కడి నుంచి వలసలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ జిల్లాల అభివృద్దిపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు లేవు. రాయలసీమ వాసులకి విశాఖపట్నం అంటే దూరాభారం అవుతుంది. సీమ నుంచి విశాఖ వెళ్ళాలి అంటే ప్రయాణం ఎంతో కష్టతరం. ఈ విషయమై సీమ వాసుల నుంచి వ్యక్తమవుతున్న వ్యక్తిరేకతను వైసీపీ ప్రభుత్వం పట్టనట్టుగానే వ్యవహరిస్తుంది.

రాజధాని మార్పు అనేది ఉద్యోగులకు ఎన్నో ఇబ్బందులను సృష్టిస్తుంది. హైద‌రాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్ళిన ఉద్యోగులు తమ పిల్లలను విజయవాడ - గుంటూరు ప్రాంతాల్లో చదివిస్తున్నారు. వీళ్లంతా ఇప్పుడిప్పుడే అక్క‌డ కుదురుకుంటున్నారు. వాళ్ళను మళ్ళీ విశాఖకు పంపిస్తే వారి కుటుంబాలకు ఎన్నో వ్యయప్రయాసలు లోనవుతాయి. అన్ని ప్రాంతాలకు ఇది త్రిశంకు రాజధానిగా మారుతుంది. ఎవరికి సంతృప్తి కలిగించడం లేదు. అని ప‌వ‌న్ త‌న ట్వీట్ లేఖ‌లో పేర్కొన్నారు. మ‌రి ప‌వ‌న్ లేఖ‌పై వైసీపీ నేత‌ల నుంచి ఎలాంటి రిటాక్ట్ వ‌స్తుందో ?  చూడాలి.




Tags:    

Similar News